రాజధాని అమరావతిపై సీఎం జగన్ వ్యూహం ఎవరికీ అంతు చిక్కడం లేదు. రెండుమూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా తిరుగుతుండడంతో అసలేం జరుగుతున్నదో తెలియక…ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఆ పార్టీ అనుబంధ ఎల్లో మీడియా విలవిలలాడుతోంది. దీనికి ఆంధ్రజ్యోతిలో ఈ రోజు (23వ తేదీ) “అమరావతిలో ఏం జరుగుతోంది” శీర్షికతో ఇచ్చిన ఇచ్చిన కథనమే నిదర్శనం.
ఈ కథనంలో మొదటి వాక్యాలనే తీసుకుంటే…”అమరావతా.. అదెక్కడుంది? అన్నారు. రాజధానిని కాదు.. ఒక శ్మశానాన్ని తలపిస్తోంది అని వ్యాఖ్యానించారు. అసలు నవ్యాంధ్ర రాజధాని ప్రస్థానాన్నే గుర్తించని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ… ఏకంగా ఆ రాజధాని గ్రామాల్లోనే తిరుగుతున్నారు. ఒకటి కాదు… రెండుసార్లు.. అదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే విస్తృత పర్యటనలు జరిపారు!” అని రాసుకెళ్లారు.
పర్యటిస్తే ఎందుకు పర్యటించారని రాస్తారు…పర్యటించక పోతే రాజధానిని గాలికి వదిలేశారని ఇదే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తారు. రాజధాని గ్రామాల్లో పురపాలకశాఖ మంత్రి పదేపదే పర్యటిస్తున్నారంటే…ఆ ప్రాంతాన్ని బాగా పట్టించుకున్నట్టే కదా లెక్క. మరెందుకు ఆందోళన?
నిన్నటికి నిన్న రాజధాని రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు, పేదలకు ఇవ్వాల్సిన పింఛన్ల విడుదలకు మొత్తం రూ.189.7 కోట్లు విడుదలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూసమీకరణ పథకం కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు 2020-21లో వార్షిక కౌలు కింద రూ.47.42 కోట్లు, రాజధాని గ్రామాల్లో పేదలకిచ్చే పింఛన్ల కోసం రూ.142.28 కోట్లు చెల్లించేందుకు మార్గం సుగుమం చేసింది.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం దాదాపు 80శాతం పూర్తయిన ప్రాజెక్టుల పూర్తికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. అలాగే రాజధానిలో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే వాటిపై పెట్టిన ఖర్చుకు తగిన ప్రతిఫలం లభిస్తుందో కూడా నివేదికల్లో పేర్కొనాలని చెప్పారని రాసుకొచ్చారు. మరి మంచిదే కదా. ఇక రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగింది, చేస్తున్నదెక్కడ?
అంతేకాదు, బొత్స వరుస పర్యటనల నేపథ్యంలో అమరావతికి సంబంధించి ఏదో కీలక నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకునేందుకు సమాయత్తమవుతోందని టీడీపీ, ఎల్లో మీడియా భయాందోళనలకు ఎందుకు గురవుతున్నాయో అర్థం కావడం లేదు. కేవలం రాజధాని ప్రాంత రైతులు బాగుంటే…ఈ రాష్ట్రమంతా బాగున్నట్టేనా? ఇక మిగిలిన ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోయినా ఫర్వాలేదా? మొత్తానికి మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండడం కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.