టిక్‌టాక్ రౌడీ బేబీ సూర్య వీరావేశానికి లోనైంది. దీంతో తానేం చేస్తున్నదో కూడా ఆలోచించలేకపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలు మాత్రం పోలేదు. ఉరి వేసుకున్న ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
టిక్‌టాక్ రౌడీ బేబీ సూర్య ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ తనకంటూ అభిమానుల్ని సంపాదించుకొంది. హలో టిక్ టాక్ వీడియోలతో టిక్ టాక్ రౌడీ బేబీ సూర్య గా ఆ యువతి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆ యువతి అసలు పేరు సుబ్బలక్ష్మి. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఈమె పలు రకాల టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది.
సుబ్బలక్ష్మి జీవితంలో ప్రేమ కథ కూడా ఉంది. ఒక యువకుడిని ఆమె ప్రేమించి వార్తలకెక్కింది. తానొక హీరోయిన్ స్థాయి సెలబ్రిటీగా భావించేది. ఇటీవలే సింగపూర్ నుంచి సుబ్బలక్ష్మి ఇంటికొచ్చింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వస్తే వెంటనే వివరాలు తెలియజేయాలి. కానీ ఆమె ఆ పనిచేయలేదు. సుబ్బలక్ష్మి సింగపూర్ నుంచి వచ్చిన విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అప్రమత్తమై ఆమెను కరోనా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. సింగపూర్‌లో తాను ఏసీ గదుల్లో ఉన్నానని, ఇక్కడ కూడా ప్రత్యేక గది సౌకర్యాన్ని కల్పించాలని ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ రోగుల మధ్య తాను ఉండలేనని గొడవ చేసింది.
ఇదే క్రమంలో ఓ విలేకరిని అసభ్య పదజాలంతో దూషించింది. సదరు విలేకరి అన్ని ఆధారాలతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మి సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సుబ్బలక్ష్మి అత్యవసర వైద్య వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు చెప్పినట్టు సమాచారం.