వాసిరెడ్డి ప‌ద్మకు కొర‌వ‌డిన మ‌ద్ద‌తు!

ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ను జ‌న‌సేన టార్గెట్ చేసింది. మూడు పెళ్లిళ్ల‌ను ప్రోత్స‌హించేలా, అలాగే స్త్రీల‌ను భోగ వ‌స్తువులుగా చిత్రీక‌రించే విధంగా స్టెప్నీ అనే ప‌దం వాడారంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు…

ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ను జ‌న‌సేన టార్గెట్ చేసింది. మూడు పెళ్లిళ్ల‌ను ప్రోత్స‌హించేలా, అలాగే స్త్రీల‌ను భోగ వ‌స్తువులుగా చిత్రీక‌రించే విధంగా స్టెప్నీ అనే ప‌దం వాడారంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ నోటీసు ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె కోరారు. ఈ నేప‌థ్యంలో వాసిరెడ్డి ప‌ద్మ‌కు ట్విట‌ర్ వేదిక‌గా జ‌న‌సేన ప్ర‌శ్న‌లు వేసింది. ఫ‌లానా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఎక్క‌డుందంటూ ఆమెను నిల‌దీశారు.

జ‌న‌సేన‌కు వాసిరెడ్డి ప‌ద్మ త‌న‌దైన శైలిలో ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. “ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే 'మహిళా కమిషన్' ఉంది. మీ పార్టీ అధినేత ఇప్పటికైనా కళ్ళుతెరిచి 'మహిళ'కు క్షమాపణ చెబితే.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే..” అని వాసిరెడ్డి ప‌ద్మ జ‌న‌సేనకు త‌గిన రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత‌టితో వివాదం ముగిసింద‌ని అనుకున్నారు.

జ‌న‌సేన‌కు టీడీపీ అండ‌గా నిలిచింది. ప‌ద్మ‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. తాజాగా జ‌న‌సేన మ‌హిళా నాయ‌కురాలు ఉషా కిర‌ణ్ కూడా ప‌ద్మ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉషా కిర‌ణ్ మీడియాతో మాట్లాడుతూ ఆడ‌వాళ్ల‌తో హేళ‌న‌గా ప్ర‌వ‌ర్తించే అంబ‌టికి నోటీసులు ఇచ్చారా? అని నిల‌దీశారు. అశ్లీల వీడియోల్లో క‌నిపించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌కు, అలాగే  కాసినో నిర్వహణకు పూనుకున్న కొడాలి నాని కి నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.  సీపీ రంగు చీర కట్టుకొని మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.  

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నాయ‌కులు విమ‌ర్శించ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌కు ఆ సంస్థ‌లోని స‌భ్యులు క‌నీసం అండ‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. వాసిరెడ్డి ప‌ద్మ‌పై ఒక‌రిద్ద‌రు స‌భ్యులు మౌనంతో ప‌రోక్షంగా త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  

కొంద‌రు మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులు అధికారాల్ని త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తున్నార‌ని, అడ్డుకుంటున్న ప‌ద్మ‌పై క‌క్ష‌క‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందుకే ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌కు సంబంధించిన పోస్టులు కాకుండా, ఇత‌రేత‌ర వ్య‌క్తిగ‌తంగా ప‌ర‌ప‌తి పెంచుకునేందుకు రాజ‌కీయ పోస్టులు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా మ‌హిళ‌ల‌కు, సంస్థ‌కు ఉప‌యోగ‌ప‌డ‌కుండా, దాన్ని త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం బాగా వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ప‌ద్మ‌కు అలాంటి వారు అండ‌గా వుండ‌డం లేద‌ని చెబుతున్నారు. 

వాసిరెడ్డి ప‌ద్మ‌కు స‌హాయ నిరాక‌ర‌ణకే కొంద‌రు స‌భ్యులు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నోటీసు విష‌యంలో వాసిరెడ్డి ప‌ద్మ ఏకాకి అయ్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాసిరెడ్డికి అండ‌గా మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులు మాట్లాడ‌క‌పోవ‌డం, ఆ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లోని లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెడుతోంది.