తాను ఎవరికీ వ్యతిరేకం కాదంటూనే అసెంబ్లీలో పాసైన బిల్లుల ఆమోదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్లుల ఆమోదానికి ఆమె మోకాలడ్డుతుందా? అనే అనుమానాలు అధికార పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించేందకు గవర్నర్ ససేమిరా అన్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్‌తో తగువుకు కారణమైంది.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఉడికించే వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోని అంశమన్నారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు వుంటాయని ఆమె స్పష్టం చేశారు. తన పరిధిలోకి లోబడి బిల్లులకు ఆమోదం తెలుపుతానని ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే గవర్నర్ వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వాటికి ఆమె క్లియరెన్స్ ఇవ్వాల్సి వుంది. పెండింగ్ బిల్లులను త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తాజాగా ఆమె చెప్పారు. తానెవ రికీ వ్యతిరేకం కాదంటూనే, గవర్నర్‌గా బాధ్యతను నిర్వరిస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది.
తన ప్రమోయం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, అలాగే రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను ఎగురవేయనివ్వకపోవడం, రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులెవరూ రాకపోవడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుడప్పుడు ఆమె తన నిరసనను ప్రకటిస్తూనే వున్నారు. బిల్లుల ఆమోదానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆమె ఏదో చేయబోతున్నారనే అనుమానం మాత్రం అధికార పార్టీ నేతల్లో వుంది. అదేంటనేది తెలియాల్సి వుంది.