దర్శకుడు పూరి జగన్నాధ్ స్టయిల్ వేరు. తన డబ్బులు నష్టపోతాడు కానీ ఒకరి డబ్బులు పడేసుకోడు. అలాంటి పూరి ఇటీవల లైగర్ సినిమాతో గట్టి దెబ్బ తిన్నాడు. డిస్ట్రిబ్యూటర్ల కు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వుంది. ఇస్తాననే అంటున్నాడు. కానీ ఇంకా ఇవ్వలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు రోడ్ ఎక్కబోతున్నారని, ఎగ్జిబిటర్లు ధర్నా చేయబోతున్నారని వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ఓ అడియో క్లిప్ లీకయింది. అది ఫోన్ సంభాషణ అని అనిపించేలా స్టార్ట్ చేసారు కానీ ఎంత మాత్రం ఫోన్ సంభాషణ కాదు అని, జస్ట్ వాయిస్ రికార్డు చేసి లీక్ చేసారని అర్థం అవుతోంది.
ఇందులో పూరి ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. రూల్స్ ప్రకారం అయితే తాను ఎవ్వరికీ పైసా ఇవ్వక్కరలేదని, కానీ నష్టపోయారు కనుక ఇవ్వాలని అనుకుని, నెల రోజులు టైమ్ అడిగానని, మాట ఇస్తే తప్పకుండా ఇస్తా అని అందులో క్లారిటీ ఇచ్చారు. సినిమా తీసిన తరువాత విడుదలకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, తనకు ఇవ్వాల్సిన వారు మాత్రం ఇవ్వరని వివరించారు. పోకిరి దగ్గర నుంచి ఇప్పటి వరకు తనకు ఎందరి నుంచో డబ్బులు రావాల్సి వుందన్నారు.
తన పరువు పోతుందని డబ్బులు వెనక్కు ఇస్తా అంటున్నానని, ధర్నా చేసి పరువు తీస్తే ఇక ఇవ్వడం అనవసరం అనే లాజిక్ ను పూరి బయటకు తీసారు. ధర్నా చేసుకుంటే చేసుకోమని, అలా చేసుకున్నవారికి తప్ప మిగిలిన వారికే డబ్బులు ఇస్తా అని పూరి స్పష్టం చేసారు.
మొత్తం మీద ఈ అడియో క్లిప్ ద్వారా పూరి తన మనసులో మాటను ఇండస్ట్రీలోకి పంపారని అనుకోవాలి. దాన్ని ఓ ఫోన్ సంభాషణ, లీక్ అనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు తప్ప వేరు కాదు.