మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని అధికార పార్టీ నేతలు భయాందోళనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవాలు ఆ పార్టీ నేతల్ని నీడలా వెంటాడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ సైన్యం కదిలింది.
ఈ నేపథ్యంలో యువత తమకు అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. మునుగోడులో పారిశ్రామిక అభివృద్ధికి పునాదులు వేశామని, నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందంటూ కేటీఆర్ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లలో మునుగోడుకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశామంటూ… ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం ఆకట్టుకుంటోంది. సుమారు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్‌పార్క్ కూడా నెలకొల్పనున్నట్టు ఆయన వివరించారు.
అలాగే స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌కు యువత అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు ఏ మాత్రం పొంతన వుందో రాబోయే ఎన్నిక ఫలితం తేల్చనుంది.