తెలంగాణా బీజేపీలో వర్గ పోరు..!

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీజీపీలోని నాయకులు అధికార గులాబీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. వీళ్లంతా అసలైన బీజేపీ…

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీజీపీలోని నాయకులు అధికార గులాబీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. వీళ్లంతా అసలైన బీజేపీ నాయకులు కారు. ఎక్కువమంది టీఆరెస్ నుంచి కమలం పార్టీలోకి వెళ్ళినవారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నవారు చెబుతున్న కారణాలు బీజేపీలో తమకు ప్రాధాన్యం లేదని, తమను పట్టించుకోవడంలేదని. వారు చెబుతున్న మరో కారణం బిజీలో వర్గ పోరును తాము భరించలేకపోతున్నామని అంటున్నారు.

 హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన తరువాత టీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని, అసంతృప్తిగా ఉన్న నాయకులంతా పొలోమని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో తమ పార్టీ బలపడుతోందని బీజేపీ నాయకులు చంకలు గుద్దుకున్నారు. టీఆర్ఎస్ పని అయిపోయిందని సంబరపడిపోయారు. కానీ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీన్ రివర్స్ అయింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు వరుసగా.. ఆ పార్టీకి రాజీనామా చేస్తుండటంతో వలస నేతలకు బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అందుకే వాళ్లంతా తిరిగి సొంత గూటికి వస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి అందుతున్న భారీ తాయిలాలు, ప్రలోభాలు కూడా కారణం కావొచ్చు.

బీజేపీలో వర్గ పోరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు తలనొప్పిగా మారిందంటున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వర్గాలు ఉన్నాయనే టాక్ మొదటి నుంచి ఉంది. కొత్తగా వచ్చిన నేతలకు ఇది ఇబ్బందిగా మారిందంటున్నారు. కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే సంజయ్ వర్గం టార్గెట్ చేస్తోందనే  ప్రచారం సాగుతోంది. హుజురాబాద్ లో విజయం తర్వాత ఈటల గ్రాఫ్ పెరిగింది. చేరికల కమిటి చైర్మెన్ గా ఆయన కూడా కొంత మంది నేతలు పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే ఈటల మనుషులుగా గుర్తింపు వచ్చిన నేతలకు సంజయ్ టీమ్ నుంచి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల వల్లే వలస నేతలు కమలం పార్టీలో ఇమడలేక సొంత గూటికి చేరుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. 

తెలంగాణ తొలి శాసనమండలి చైర్మెన్ గా పని చేసిన స్వామి గౌడ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించిన స్వామిగౌడ్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీలో  తనకు సరైన ప్రాధాన్యత లేదని ఆయన చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, బూడిద బిక్షమయ్య గౌడ్ కూడా బీజేపీలో ఉండలేకపోయారు. తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరిన నెలన్నర రోజుల్లోనే ఆ పార్టీని వీడారు.టీడీపీలో కీలక నేతలుగా ఉన్న బండ్రు శోభారాణి, కొండ్రు పుష్పలీలలు బీజేపీలో చేరిన కొంత కాలానికే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. 

తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేయబోతున్నానని, అతి త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నానని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా వ్యవహరించిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి..  బీజేపీలో చేరారు అయితే ఆ పార్టీలో ఇమడలేక  కొంత కాలానికి కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బోడ జనార్ధన్ లు కమలం పార్టీతో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. 

తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రులు బయటికి వచ్చేశారు. పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోడ జనార్ధన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాజీ మంత్రులుగా ఉన్న తమను బీజేపీలో ఎవరూ పట్టించుకోలేదని వాళ్లు ఆరోపించారు. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. మరి ఈ పరిణామాలు కమలం పార్టీని ముంచుతాయా అనేది ఉప ఎన్నిక ఫలితం తేలుస్తుంది.