ఏపీలో సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ, వైసీపీ నాయకులు కానీ మూడు రాజధానులు మంత్రాన్ని వదలడంలేదు. రాజధానుల కేసు సుప్రీం కోర్టుకు వెళ్లినా, అదేలాంటి తీర్పు ఇస్తుందో తెలియకపోయినా మూడు రాజధానులు తప్పవు అంటున్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం ఖాయమంటున్నారు. అరసవెల్లికి అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిగా ఉండాలని అనుకోవడంలేదా?
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటల్లోనే ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఆవేదన కూడా కనబడింది. విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు డిమాండ్ చేయడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు నోరు ఎందుకు విప్పడం లేదని, ఎందుకు అంత కష్టంగా ఉందని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జై అనడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ఉత్తరాంధ్ర వాసులను మంత్రి ధర్మాన ప్రశ్నించారు.
విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన రాజధానిపై ఆవేదన చెందారు. జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మీకు అనిపిస్తే చెప్పండని, సరిదిద్దుకుంటామని ధర్మాన ప్రసాద రావు అన్నారు. విశాఖపట్నం రాజధాని అయ్యే విషయం రాష్ట్ర యువతే ఆలోచించుకోవాలని మంత్రి కోరారు. అమరావతిలో అన్ని వసతులతో రాజధానిని నిర్మించాలంటే లక్షలాది కోట్ల రూపాయలు కావాలని, అదే విశాఖలో రాజధానిని కొనసాగించేందుకు కేవలం రూ. 1500 కోట్లు చాలన్నారు.
ధర్మాన ప్రసాదరావు ఇంతలా ఆవేదన చెందుతున్నదంటే ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడంలేదా అనే అనుమానం కలుగుతోంది. మూడు రాజధానులకు మొగ్గు చూపుతున్న వైసీపీ.. ఈ దిశగా విశాఖను పాలనా రాజధాని చేస్తామని చెబుతున్నా దీనికి సంబంధించి ఇక్కడ ప్రజల నుంచి అనుకున్న విధంగా జోష్ కనిపించడం లేదనేది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేసినా.. మంత్రులు గర్జన పేరుతో హడావుడి చేసినా.. ప్రజల నుంచి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు.. విశాఖలో అడుగుపెట్టి రాజధానికి వ్యతిరేకంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే.. అది తమకు మైనస్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కీలక పార్టీల నాయకులు.. ప్రజలను ప్రభావితం చేసే నేతలను అసలు.. విశాఖలోకి అడుగు పెట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇది మంచి పరిణామం కాదని.. రేపు విశాఖ ప్రజల్లో ఇదే వాదన బలపడితే.. అది వైసీపీకి మొత్తానికి మేలు చేయకపోగా.. కీడు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.