మాజీ మంత్రి ఏపీ బీజేపీలో వుంటారా?

ఏపీ బీజేపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన మొద‌ట్లో రాజ‌కీయ ఆశ్ర‌యం కోసం టీడీపీ ముఖ్య నేత‌లు బీజేపీ పంచ‌న చేరారు. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వంతో సీఎం జ‌గ‌న్‌కు మంచి సంబంధాలున్నాయి.…

ఏపీ బీజేపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన మొద‌ట్లో రాజ‌కీయ ఆశ్ర‌యం కోసం టీడీపీ ముఖ్య నేత‌లు బీజేపీ పంచ‌న చేరారు. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వంతో సీఎం జ‌గ‌న్‌కు మంచి సంబంధాలున్నాయి. దీంతో బీజేపీలో వుంటే త‌మ‌ను జ‌గ‌న్ ట‌చ్ చేయ‌ర‌నే ఉద్దేశంతో న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ మూడున్న‌రేళ్ల పాల‌న పూర్తి చేసుకున్నారు. నెమ్మ‌దిగా ఎన్నిక‌ల‌పై దృష్టి సారిస్తున్నారు. మ‌ళ్లీ అధికారంలోకి ఎలా రావాల‌నే దానిపై జ‌గ‌న్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌రోవైపు 2024లో జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటోంది. కానీ జ‌న‌సేన ఆలోచ‌న‌లు వేరుగా వున్నాయి. దీంతో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిస్తే త‌మ‌కు భ‌విష్య‌త్ లేద‌ని ఏపీ బీజేపీ నేత‌ల్లో కొంద‌రు తర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీంతో టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో పొత్తు కుదుర్చుకోవాల‌ని ఏపీ బీజేపీ ముఖ్య నేత‌ల‌పై వారు ఒత్తిడి చేస్తున్నార‌ని స‌మాచారం.

కాదు, కూడ‌ద‌ని ఏపీ బీజేపీ చీఫ్ ప‌దేప‌దే చెబుతుండ‌డంతో వారు అస‌హ‌నానికి గురి అవుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత‌లే పొత్తుపై ఒత్తిడి తెస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జ‌మ్మ‌ల‌మ‌డుగు బీజేపీ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి వైఖ‌రి ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచే పోటీ చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే అక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున ఆది అన్న కుమారుడు భూపేష్ పోటీ చేయ‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకే కుటుంబం నుంచి వేర్వేరు పార్టీల త‌ర‌పున పోటీ చేసే అవ‌కాశం లేద‌చే చ‌ర్చ జ‌రుగుతోంది. యువ‌కుడైన భూపేష్‌కు అవ‌కాశం ఇచ్చి, ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌ప్పుకుంటారా? లేక బీజేపీని వీడి టీడీపీలో చేరుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. 

బీజేపీలో వుంటే మాత్రం రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌ర‌మ‌నేది ఆదినారాయ‌ణరెడ్డి అభిప్రాయం. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డితే త‌ప్ప ఏపీ బీజేపీలో చేరిన నేత‌ల అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌దు. అంత వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.