ఇడుపులపాయ ఉత్కంఠకు తెర పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి మధ్య పరిణామాలు చూస్తే … వైఎస్ జగన్ కుటుంబ సంబంధాలు మెరుగుపడినట్టే కనిపించింది. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ కుటుంబమంతా ఇడుపులపాయకు వెళ్లింది.
గత కొంత కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన చెల్లి షర్మిల మధ్య రాజకీయ విభేదాలు నెలకున్న సంగతి తెలిసిందే. దీంతో వర్ధంతి నాడు షర్మిల, జగన్ కలిసి నివాళులర్పిస్తారా? లేదా? అనే చర్చ కు దారి తీసింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సంతోషంగా ఊపిరి పీల్చుకునే సీన్ ఇడుపులపాయలో ఆవిష్కృతమైంది.
వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది జూలై 8న వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ కలిసి ఇడుపులపాయలో ఆ దివంగత నేతకు ఘన నివాళులర్పించారు. అనంతరం అదే రోజు హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అనే పేరుతో షర్మిల రాజకీయ పార్టీని ప్రారంభించారు.
తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్న మాట కాదని చెల్లి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో వైఎస్సార్ జయంతి నాడు అన్నాచెల్లెళ్లు వేర్వేరు సమయాల్లో ఎవరికి వారుగా నివాళులర్పించిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి అన్నాచెల్లెళ్లు అసలు ఒకచోట కలిసిన దాఖలాలు లేవు. ఇద్దరి మధ్య మాటలు కూడా కరువయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ సతీమణి భారతి, షర్మిల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యం లో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని మరోసారి ఆయన కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఇదే సందర్భంలో వైఎస్సార్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని విజయమ్మ హైదరాబాద్‌లో ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాటు జగన్‌కు నచ్చలేదని చెబుతున్నారు. దీంతో మరోసారి వైఎస్ విజయమ్మ, షర్మిల కలిసి ఒకసారి, వైఎస్ జగన్, ఆయన భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు మరోసారి వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారనే ప్రచారం జరిగింది.
వైఎస్ కుటుంబంలో చీలక ఏర్పడిందనే ప్రచారంపై వైసీపీ శ్రేణులు, వైఎస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ తల్లి, చెల్లితో కలిసి తండ్రికి వైఎస్ జగన్ నివాళులర్పించిన దృశ్యం ఇడుపులపాయలో ఆవిష్కృతమైంది. వైఎస్ సమాధి వద్ద జగన్, షర్మిల పక్కపక్కనే కూచుని తండ్రికి ఘన నివాళులర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం, అక్కడే వైఎస్ విగ్రహానికి షర్మిల, వైఎస్ భారతి కలిసి పూలదండ వేసి నివాళులర్పించడం విశేషం. భారతి, షర్మిల పక్కనే విజయమ్మ కూడా ఉన్నారు. దీంతో వదిన-ఆడబిడ్డ మధ్య విభేదాలకు చెక్ పెట్టినట్టైంది. తాజా ఇడుపులపాయ పరిణామాలు వైఎస్ జగన్‌కు సానుకూలంగా మారాయి.
ఇంత కాలం వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలపై రకరకాలుగా సాగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలికారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్సార్ జయంతి నాటి పరిస్థితులతో పోల్చితో వర్ధంతి నాటికి అన్నీ చక్కబడినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.