ఆ పార్టీలో క‌ట్టు త‌ప్పుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌!

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు బీజేపీ మారుపేరు. కానీ ఏపీ బీజేపీలో కొంద‌రు నాయ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను క‌ట్టు త‌ప్పుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఇటీవ‌ల సోము వీర్రాజుపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ,…

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు బీజేపీ మారుపేరు. కానీ ఏపీ బీజేపీలో కొంద‌రు నాయ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను క‌ట్టు త‌ప్పుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఇటీవ‌ల సోము వీర్రాజుపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పొత్తు పొత్తు కుదుర్చుకోక‌పోతే రాజ‌కీయ భ‌విష్య‌త్ వుండ‌ద‌ని ఆందోళ‌న చెందుతున్న వాళ్లంతా ఒక్కొక్క‌రుగా నిర‌స‌న గ‌ళం విప్పుతున్నారు. 

ఏపీ బీజేపీలో నేత‌ల వైఖ‌రిని ఢిల్లీ నాయ‌క‌త్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణుకుమార్‌రాజు త‌న అసంతృప్తిని సున్నితంగా బ‌య‌ట‌పెట్టారు. ఒక‌వైపు ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ సునీల్ దియోధ‌ర్, రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు వ‌ద్దేవ‌ద్ద‌ని తేగేసి చెబుతున్నారు. కేవ‌లం జ‌న‌సేన‌తో మాత్ర‌మే పొత్తు వుంటుంద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీతో పొత్తు వుండాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని విష్ణుకుమార్‌రాజు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పొత్తుల‌పై కేంద్ర నాయ‌క‌త్వం ఆలోచిస్తుంద‌న్నారు. రాష్ట్ర నాయ‌క‌త్వం అమ‌లు చేస్తుంద‌న్నారు. అంటే పొత్తుల‌పై రాష్ట్ర నాయ‌క‌త్వం అభిప్రాయాల‌కు చోటే లేద‌ని ఆయ‌న చెప్పిన‌ట్టైంది. వైసీపీని ఓడించ‌డానికి అన్ని పార్టీలు క‌ల‌వాల‌నే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.  

ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తోందే త‌ప్ప‌, మ‌రెవ‌రినో గ‌ద్దె దించ‌డానికి లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌, అలాగే రాష్ట్ర అధ్య‌క్షుడి అభిప్రాయాల‌కు భిన్నంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడ్డం ఏంట‌నే చ‌ర్చ న‌డుస్తోంది. పార్టీలో క‌ట్టు త‌ప్పుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌పై అధినాయ‌క‌త్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే మాత్రం… బ‌లోపేతం కావ‌డం దేవుడెరుగు, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే ఆందోళ‌న నాయ‌కుల్లో నెల‌కుంది. మ‌రి పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.