ఫ్యాన్స్ కు ఆనందం..థియేటర్లకు సంకటం

సినిమా హీరోల ఫ్యాన్స్ కు కొత్త వేలాం వెర్రి పట్టుకుంది. తమ హీరోల సినిమాలు రీరిలీజ్ చేసుకోవడం అన్నది ఈ కొత్త పిచ్చి. నిజానికి 70-80 దశకంలో ఈ రీరిలీజ్ లు వుండేవి. సినిమా…

సినిమా హీరోల ఫ్యాన్స్ కు కొత్త వేలాం వెర్రి పట్టుకుంది. తమ హీరోల సినిమాలు రీరిలీజ్ చేసుకోవడం అన్నది ఈ కొత్త పిచ్చి. నిజానికి 70-80 దశకంలో ఈ రీరిలీజ్ లు వుండేవి. సినిమా హక్కులు కొనుక్కున్నవారే ఇలా రీరిలీజ్ లు ప్లాన్ చేసుకునేవారు. అంతే తప్ప ఫ్యాన్స్ కోసమో, రికార్డుల కోసమో కాదు. హీరో కృష్ణ దేవదాస్ సినిమా విడుదల చేస్తుంటే దాని మీద పోటీగా ఎఎన్నార్ దేవదాస్ ను రీరిలీజ్ చేసారు. మొత్తం మీద ఫ్యాన్స్ తో ప్రమేయం లేకుండానే సినిమాల రీరిలీజ్ లు అనేవి వుండేవి. అయితే రాను రాను విడియో క్యాసెట్ లు, సిడిలు, ఆఖరికి యూట్యూబ్ వచ్చాక ఈ రీలీజ్ లు అన్నవి మాయం అయ్యాయి. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు చూసుకోవడానికి కంటెంట్ అందుబాటులో వుంది కదా.

కానీ ఉన్నట్లుండి ఈ రీరిలీజ్ ల వేలాం వెర్రి పట్టుకుంది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా సినిమాలు విడుదల చేయడం, స్పెషల్ షో లు వేయడం మొదలైంది. ఇది అక్కడితే ఆగిపోతే బాగుండేది. కానీ అలా ఆగడం లేదు. వాటికి మళ్లీ కలెక్షన్ల రికార్డులు, హౌస్ ఫుల్ రికార్డులు లెక్కలు తీస్తున్నారు. పోనీ అక్కడితో ఆగినా సరిపోయేది. వెర్రో, పిచ్చో, మరేంటో కానీ థియేటర్లు పాడు చేస్తున్నారు.

సీట్లు చింపేయడం, తెరలు చింపేయడం, ఇలా నానా గత్తర చేస్తున్నారు. ఆఖరికి థియేటర్లు తగులబెట్టే రేంజ్ కు వెళ్లిపోయారు. తమ హీరోల సినిమాలు చూపించే థియేటర్లను తామే తగులబెట్టడం అంటే మూర్ఖత్వం అనుకోవాలా? ఇంకేమైనా అనుకోవాలా? ఇప్పటికే ఫ్యాన్స్ షో లు అంటే థియేటర్లు ఇవ్వము అని డిసైడ్ అయిపోతున్నారు. ఈస్ట్ గోదావరి థియేటర్ల అసోసియేషన్ ఇప్పటికే ఈ మేరకు తీర్మానం చేసింది. గుంటూరు జిల్లాలో యువి సంస్థ తమ థియేటర్లలో ఫ్యాన్స్ షో లు అనుమతించడం లేదు.

ఇక మరి కొన్నాళ్ల తరువాత ఇక ఫ్యాన్స్ షో లు అంటే థియేటర్ల తలుపులు మూసేసే రోజులు వచ్చేస్తాయి. అప్పుడు కానీ ఈ వేలం వెర్రి కి ఫుల్ స్టాప్ పడదు. అయినా ఫ్రీ గా కంటెంట్ వుండగా, వందలు, వేలు ఖర్చు పెట్టి సినిమాలు చూడడం అంటే ఏమనుకోవాలో? సంపాదించే వాళ్లు ఖర్చు చేసినా ఓకె. తల్లితండ్రుల మీద ఆధారపడిన కుర్రాళ్లు ఇలా డబ్బు వృధా చేస్తుంటే ఆ బేస్ ను అడ్డం పెట్టుకుని హీరోలు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు.