పార్టీ కుర్చీలో ఖర్గే, ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌?!

కాంగ్రెస్‌ చిత్రం మారింది. కొలువు తీరాల్సిన నేత ఊరేగుతున్నారు. ఊనేగాల్సిన నేతల్లో ఒకరు కొలువు తీరారు. మొదటి నేత రాహుల్‌ గాంధీ, రెండవ నేత మల్లికార్జున్‌ ఖర్గే. అవును గత 24 యేళ్ళలోనూ నెహ్రూ`గాంధీ…

కాంగ్రెస్‌ చిత్రం మారింది. కొలువు తీరాల్సిన నేత ఊరేగుతున్నారు. ఊనేగాల్సిన నేతల్లో ఒకరు కొలువు తీరారు. మొదటి నేత రాహుల్‌ గాంధీ, రెండవ నేత మల్లికార్జున్‌ ఖర్గే. అవును గత 24 యేళ్ళలోనూ నెహ్రూ`గాంధీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షులుగా వుంటున్నారు. సోనియా గాంధీ కావచ్చు రాహుల్‌ గాంధీ కావచ్చు. ఇప్పుడు మళ్ళీ అవకాశం కాంగ్రెసేతర వ్యక్తికి వచ్చింది. అదీ రెండు షరతులవల్ల. 

ఒకటి: నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు పోటీలో లేక పోవటం. రెండు: ఆ కుటుంబ సభ్యుల విధేయుడే పోటీలో వుండటం. పేరుకు శశి థరూర్‌ పోటీలో వున్నా, ఖర్గే నామినేషన్‌ వేసినప్పటి నుంచీ ఆయనదే గెలుపని దాదాపు ఖరారు అయిపోయింది. ఈ ఏడాది (2022) అక్టోబరు 2022 న జరిగిన ఈ ఎన్నికలలో మొత్తం 9,385 వోట్లు పోయలయ్యాయి. అందులో ఖర్గే కు 7,800 వోట్లు వస్తే, శశి థరూర్‌కు 1,072 వోట్లు దక్కాయి.

మల్లికార్జున్‌ ఖర్గే జగమెరిగిన దళిత నేత కావటం కూడా విశేషమే. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో దళిత నేతలు ఇంతకు ముందు లేరా? అంటే వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన దామోదరం సంజీవయ్య 1962లోనూ, జగ్జీవన్‌ రామ్‌ 1969లోనూ ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) అధ్యకులుగా వున్నారు. కానీ చరిత్ర చెబుతున్నది ఒక్కటే. నెహ్రూ`గాంధీ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి ఆ పదవిలో వున్నా, పేరుకే తప్ప, మొత్తం కథనంతా నెహ్రూ`గాంధీ కుటుంబ సభ్యులే నడిపిస్తారు. 

కానీ చిత్రంగా, ఖర్గే ఎన్నిక కాగానే, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య కాస్త భిన్నంగా వుంది. ‘ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడే అత్యున్నత అధికార కేంద్రం. కాంగ్రెస్‌లో ఎవరు ఏవిషయన్నాయినా ఆయనకే నివేదించాలి. నా పాత్రకూడా ఆయనే నిర్ణయిస్తారు. నేను ఏ పనిచెయ్యాలో కూడా ఆయనే చెప్పాలి’ అని అన్నారు. ఇవి మాటల వరకేనా? చేతలు వరకూ వుంటాయా అన్నది చూడాలి.

ఈ ఎన్నికలు జరగుతుంటే, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరు మీద కాలినడకన జనంలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఈ యాత్ర రాహుల్‌ గాంధీకి భిన్నమైన ఇమేజ్‌ తెచ్చిపెడుతోంది. సాదా సీదా టీషర్టులో సాధారణ వ్యక్తిలాగా, అందరిలోనూ కలసిపోతూ కనిపించటం కాకుండే. చాలా చురుకుగా కూడా కనిపిస్తున్నారు. యాభయ్యవ పడిలో వున్న నెహ్రూ`గాంధీ కుటుంబ వారసుడు, తనకు అధ్యక్ష పదవి వద్దంటూ, ఇలా ఉత్తినే తిరుగుతారా? ఎనభయ్యేళ్ళ ఖర్గే, కాంగ్రెస్‌ అధ్యక్షపదవిలో వుండి పార్టీకి ఏళ్ళ పాటు చికిత్స చేస్తారా?

పార్టీ సంస్థాగత ఎన్నికలలో ఖర్గే ఎన్నిక కావటమంటే ఆయనే కాంగ్రెస్‌ పార్టీ ముఖంగా వుండటం కాదని ముందే తేలిపోయింది. పార్టీ శ్రేణులకు మాత్రమే ఖర్గేని చూపించి, ప్రజలు మొత్తానికి రాహుల్‌ గాంధీని నిలువెత్తు నేతగా చూపాలన్నది సోనియా గాంధీ వ్యూహమని అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. 

దశాబ్దం క్రితం దేశంలోకెల్లా విధేయతకు మారుపేరుగా తమిళ నాడులోని పన్నీర్‌ సెల్వం ను చెబుతుండే వారు. పురచ్చితలై జయలలిత ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఖాళీ చెయ్యాల్సి వచ్చినా, అందులో పన్నీర్‌ సెల్వం ను కూర్చోబెట్టి వెళ్ళేవారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ పీఠాన్ని అతి జాగ్రత్తగా ఆయన జయలలితకు ఒప్పగించేవారు. ఇది కేవలం ప్రాంతీయ చిత్రం.

కానీ కాంగ్రెస్‌లో నాయకత్వపు మార్పు అంటే, అది జాతీయ చిత్రం. ఇక్కడ ఖర్గే కూడా విధేయతకు చిహ్నమే. ఆయన నెహ్రూ`గాంధీ కుటుంబానికి ఎంత విధేయుడంటే, ఆయన పిల్లలకు కూడా, ఆ కుటుంబ సభ్యుల పేర్లే పెట్టుకున్నారని జీవితచరిత్రకారుడు హెచ్‌.టి పోటే అంటారు.  ‘ప్రియాంక, రాహుల్‌, ప్రియదర్శిని’ (ఇందిర అసలు పేరు ఇందిరా ప్రియదర్శినే’ కదా!) ఇలా వుంటాయి ఆ పేర్లు. కాదూ,  ఖర్గే అంబేద్కర్‌ వాది, బౌధ్ధుడూ కావటంతో ఈ పేర్లు పెట్టారని ఆయన సన్నిహిత మిత్రులు అంటారనుకోండి. అది వేరే విషయం.

అయితే కేవలం పేర్లు మాత్రమే కాదు. ఆయన కార్యచరణ కూడా అందుకు భిన్నంగా లేదు. ఖర్గే నిజంగానే చేవ వున్న నేత. దొడ్డి దారిన వచ్చిన నాయకుడు కారు. ఆయన ఆయన ప్రత్యక్ష ఎన్నికలలో 12 సార్లు పోటీ చేసి, 11 సార్లు గెలుపొందారు. అది కూడా గత (2019) ఎన్నికలలోనే. అప్పుడు రాజ్యసభకు ఎన్నికయి, కాంగ్రెస్‌ కు సభాపక్ష నేతగా వుంటున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన ఇంతటి యోధుడికి ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి అంగుళం దూరం నుంచి వెళ్ళిపోతూ వుండేది. ఆయన ఈ పదవిని ముమ్మారు (1999లోనూ, 2004లోనూ, 20013లోనూ) కర్ణాటక సీఎం పోస్టును జారవిడుచుకున్నారు. అలాంటప్పుడు ఎంతటి వారికయినా పార్టీ అధిష్ఠానం (నెహ్రూ`గాంధీ కుటుంబసభ్యులే కదా ఆయా సందర్భంలో వున్నదీ..!) మీద ఏ మాత్రం వ్యతిరేకత పెంచుకోలేదు. పైపెచ్చు ఎప్పుడు ఏ బాధ్యతను ఒప్పగించినా, విధేయంగా చేసిపెట్టారు.

కాంగ్రెస్‌ కు 2014 సార్వత్రిక ఎన్నికలలో కోలుకోని దెబ్బతగిలింది. రాహుల్‌ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా చూపి ఎన్నికల బరిలోకి దూకారు. లోక్‌సభలో అత్యంత బలహీనమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ మిగిలిపోయింది. అప్పుడు లోక్‌సభా పక్ష నేతగా రాహుల్‌ గాంధీ వుండదలచుకోలేదు. అప్పుడు మాత్రం ఖర్గే గుర్తుకొచ్చారు. అయినా మారు మాట చెప్పకుండా, ఆ బాధ్యతను స్వీకరించారు. ఆ తర్వాత రాజ్యసభలోనూ అలాంటి పాత్రకు సిధ్ధమయ్యారు.

అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో వున్న అసమ్మతి తెలిసిందే. వైఫల్యాల మీద వైఫల్యాలు జరిగిపోతున్నా, సోనియా`రాహుల్‌`ప్రియాంక త్రయం ఏక పక్ష నిర్ణయాలతో విసుగెత్తి పోయారు. కానీ వారిలో పలువురు తిరిగి మళ్లీ ఆ కుటుంబ భజనే చేశారు. 

అయితే శశి థరూర్‌కి వెయ్యి వోట్లన్నా పడ్డాయంటే, ఆమేరకు వ్యతిరేకత వున్నట్లు లెక్క. ఈ వ్యతిరేకత ఖర్గే మీద కాదు. ఈ త్రయం మీదనే. కాబట్టి ఖర్గేని స్వతంత్ర నేతగా వదలితే అది వేరే విషయం. లేకుంటే ఈ అసంతృప్తి పెరిగేదే కానీ, తగ్గేది కాదు.