రోజా టార్గెట్ గా ఎయిర్ పోర్టులో దాడికి పక్కా ప్లాన్

అనూహ్యమో లేక యాధృచ్చికంగానో ఆవేశంగానో చేసిన దాడి కాదు, పక్కా ప్లాన్ తోనే మంత్రుల మీద జనసేన శ్రేణులు దాడి చేశాయని విశాఖ పోలీసులు తమ దర్యాప్తులో  వెల్లడించారు. ఒక పద్ధతి ప్రకారం అనుకునే…

అనూహ్యమో లేక యాధృచ్చికంగానో ఆవేశంగానో చేసిన దాడి కాదు, పక్కా ప్లాన్ తోనే మంత్రుల మీద జనసేన శ్రేణులు దాడి చేశాయని విశాఖ పోలీసులు తమ దర్యాప్తులో  వెల్లడించారు. ఒక పద్ధతి ప్రకారం అనుకునే ఈ దాడులు చేశారని విశాఖ నగర పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ తెలియచేశారు.

నిజానికి మంత్రి రోజా మీద దాడి చేయాలన్నదే పధక రచన వెనకున్న లక్ష్యమని  ఆయన వెల్లడించారు. అయితే చివరికి ఆ ఘటనలో మంత్రి పీఏ తో పాటు పెందుర్తి సీఐ గాయపడ్డారని ఆయన వివరించారు. అలాగే మంత్రుల కార్ల మీద దాడులు కూడా వ్యూహంలో భాగమే అని ఆయన పేర్కొనడం విశేషం.

విశాఖలో పవన్ ర్యాలీ తీసి అయిదు గంటల పాటు ట్రాఫిక్ కి అవాంతరం కలిగించారని జనసేన వారి మీద పోలీసుల అభియోగం, కేసు కూడా దాని మీద పెట్టారు. ఈ విషయం మీద సీపీ మాట్లాడుతూ ర్యాలీకి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేయడం గమనార్హం.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఆయన వివరించారు. ఈ మొత్తం ఘటనలో పూర్తి దర్యాప్తు చేశామని, అలాగే వేరు వేరు సంఘటనలకు సంబంధించి వంద మంది దాకా బాధ్యులను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో కొంతమంది విశాఖ ఘటన మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ ఘటనలో పవన్ కళ్యాణ్ కి జనసైనికుల మీద పోలీసులు దాష్టికం చేశారంటూ వచ్చిన వార్తలు అలాగే ప్రతిపక్ష నాయకులు మొత్తం ఈ విషయంలో ప్రభుత్వమే తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్న తీరు ఒక వైపు ఉన్నది. అయితే ఇపుడు పోలీసుల దర్యాప్తు అంశాలతో ఆ సందేహాలు అన్నీ  పటాపంచలు అవుతున్నాయి.

మంత్రుల మీద భౌతిక  దాడులకు జనసేన నుంచి అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపధ్యాన్ని కూడా కలుపుకుని చూస్తే పోలీసుల దర్యాప్తులో  కూడా ఎయిర్ పోర్ట్ దాడులు  పక్కా ప్లాన్ అన్నది తెలుస్తోంది అంటున్నారు. భౌతిక దాడులకు ప్రజాస్వామ్యంలో తావు లేదు, రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఇకనైనా ఇలాంటి వాటిని సవరించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అనే అందరూ అంటున్న మాట.