పవన్ ను ఇక వదిలేయండి

వెనకటికి ఏదో సామెత చెప్పినట్లుంది వైకాపా వ్యవహారం. పవన్ తను అనుకున్నది లేదా తను చేయాల్సి వచ్చినది చేసేసారు. విశాఖ వెళ్లి గర్జన ను ఫెయిల్ చేయించడానికి లేదా దాని ప్రభావం తగ్గేలా చేయడానికి…

వెనకటికి ఏదో సామెత చెప్పినట్లుంది వైకాపా వ్యవహారం. పవన్ తను అనుకున్నది లేదా తను చేయాల్సి వచ్చినది చేసేసారు. విశాఖ వెళ్లి గర్జన ను ఫెయిల్ చేయించడానికి లేదా దాని ప్రభావం తగ్గేలా చేయడానికి తాను చేయగలిగింది చేసారు. వెల్ ప్లాన్డ్ గా విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, మాట్లాడాల్సి వచ్చినది మాట్లాడేసి, పనిలో పనిగా చంద్రబాబును కలిసి తన భవిష్యత్ ప్రణాళిక ఇదే అని చెప్పకనే చెప్పారు. భాజపా కలిసి వస్తే సరే లేదంటే తన దారి తాను చూసుకుంటా అని అన్యాపదేశంగా చెప్పేసారు కూడా. ఆపైన తాబేలు డిప్పలో దూరిపోయి, ఎవరు ఎంత గింజుకున్నా బయటకు రాని చందంగా, తన ఇంటికి తాను వెళ్లిపోయారు.

అక్కడితో ఒక అంకం ముగిసింది. ఆ తరువాత వైకాపా జనాలు రెచ్చిపోయి, ఒకరిని మించి మరొకరు జనసేనాధిపతిని గట్టిగా దుయ్యబట్టారు. అట్నుంచి, ఇట్నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు వెల్లువెత్తాయి. ఆ తరువాత నీరసం వచ్చింది. అంతా సద్దుమణిగింది. అటు తేదేపా ఇటు వైకాపా, ఆపై జనసేన అంతా సైలెంట్.

కానీ ఎవరికి పుట్టిన బద్దో కానీ మహిళాకమిషన్ నుంచి పవన్ కు నోటీస్. మహిళలను కించపరిచారు సమాధానం చెప్పండి అంటూ. స్వామి భక్తితో ఈ పని చేసి వుంటే ఓకె. కానీ ఇది సరైన మూవ్ అయితే కాదు. నిత్యం రాజకీయాల్లో మహిళలను కించపరుస్తూనే వున్నారు. జగన్ సతీమణి భారతిని, బాబుగారి సతీమణి భువనేశ్వరిని, బాలయ్య కుమార్తె బ్రాహ్మిణి పేర్లను బయటకు లాగి యాగీ చేస్తూనే వున్నారు. ఇందులో అన్ని పార్టీల తప్పిదాలూ వున్నాయి.

చాలా మంది నాయకుల వెంట అమ్మ..ఆలి..లాంటికి కాస్త తక్కువగా సభ్యత గీత దాటడానికి కాస్త ఎక్కువగా బూతులు వినిపిస్తూనే వున్నాయి. కానీ ఇదేదో తొలిసారి, కొత్తగా అన్నట్లు పవన్ కు నోటీసులు ఇచ్చారు. నిజానికి పవన్ నాయకుడు. ఓ పార్టీ అధినేత అందువల్ల సంయమనంతో మాట్లాడాల్సి వుంది. చంద్రబాబు, జగన్ పార్టీలో జనాలు తమ చిత్తానికి మాట్లాడతారు కానీ ఆ ఇద్దరూ కాదు. పవన్ కూడా ఇలాంటి తీరు అలవర్చుకోవాలి. కోపం ప్రదర్శించవచ్చు. కానీ భాష ప్రధానం.

ఏదో దొరికింది చాన్స్ అని మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు ఇవ్వడం బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు నిత్యం కళ్ల ముందు అనేకం జరుగుతున్నాయి. పైగా పవన్ ను సాధించడానికి వైకాపా తాపత్రయ పడుతోంది అన్న భావన జనాల్లోకి వెళ్తుంది. ఇది వైకాపాకు హితం చేసేది అయితే కాదు.

ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్థం సమయం వుంది. ఈ లోగా ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో, ఎన్ని కలయికలు, పొత్తులు, చిత్తులు వుంటాయో ఇప్పుడే ఊహకు అందదు. అందువల్ల పవన్ అతని సినిమాలకు అతన్ని వదిలేసి వైకాపా తన రాజకీయం తాను చూసుకోవాలి. ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వుందో చూసుకుని అక్కడ ప్యాచ్ లు వేసుకోవాలి. మూడు రాజధానులు తన పాలసీ కనుక దానికి అనుగుణంగా జనంలోకి వెళ్లాలి.

అంతే తప్ప అనవసరం గా పవన్ ను సాధించుకుంటూ కూర్చోడం అన్నది టైమ్ వేస్ట్ వ్యవహారం.  పైగా దాని వల్ల పవన్ కు జనాల్లో ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గదు.