ఇండస్ట్రీలో కొన్ని ఈక్వేషన్లు, మరికొన్ని వివాదాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. హీరో-విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ను చంపేసినలాంటి వ్యవహారాలు చాలానే జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే ఒకటి దర్శకుడు మారుతికి ఎదురైంది.
పవన్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని భావించింది ఓ కాపు కమ్యూనిటీ బ్యాచ్. ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడంతో పాటు కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా వాళ్లకున్నాయి. అందుకే ఆ కార్యక్రమానికి టాలీవుడ్ కు చెందిన కాపు ప్రముఖుల్ని ఆహ్వానించాలనుకుంది. ఇందులో భాగంగా దర్శకుడు మారుతి పేరుతో ఆహ్వాన పత్రిక ప్రింట్ అయిపోయింది. మీడియాకు కూడా సర్కులేట్ అయిపోయింది.
కట్ చేస్తే, ఈ ఫంక్షన్ కు రావడం లేదని మారుతి చెప్పేశాడు. పవన్ పుట్టినరోజు వేడుకకు రానని ఎవ్వరూ చెప్పరు. మరీ ముఖ్యంగా ఒకే కులానికి చెందిన మారుతి లాంటి వ్యక్తులు అస్సలు చెప్పరు. కానీ మారుతి ఎందుకు డ్రాప్ అయినట్టు. సరిగ్గా ఇక్కడే బన్నీ పేరు తెరపైకొచ్చింది.
మారుతి-బన్నీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అదే టైమ్ లో బన్నీ-పవన్ మధ్య ఉన్న అభిప్రాయబేధాల గురించి కూడా అందరికీ తెలిసిందే. సో.. పవన్ పుట్టినరోజు వేడుకకు వెళ్తే మారుతి-బన్నీ మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే బన్నీ కోసం పవన్ బర్త్ డే వేడుకకు మారుతి దూరంగా ఉన్నాడని టాలీవుడ్ టాక్.
ఇండస్ట్రీలో పైకి కనిపించని గ్రూపులు చాలానే ఉన్నాయి. కానీ ఎవ్వరూ బయటపడరు. హీరోలైనా, దర్శకులైనా తమ కమ్యూనిటీకి చెందిన మీటింగ్స్, ఫంక్షన్లకు హాజరవ్వరు. ఇదే స్ట్రాటజీని అనుసరించి మారుతి కూడా తప్పుకున్నాడంటూ ఓ మీడియా పైకి చెబుతున్నప్పటికీ, తెరవెనక కారణం మాత్రం బన్నీ అని తెలుస్తోంది.