ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలపై దాదాపు స్పష్టత వచ్చింది. అక్టోబర్ లేదా నవంబర్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడం, అలాగే తెలంగాణాలో మంత్రి ఈటల రాజేందర్ అనూహ్యంగా కేబినెట్ నుంచి తప్పుకోవడం, అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమవుతోంది.
ఏదైనా స్థానం ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. బద్వేలు, హుజూరాబాద్ స్థానాలకు నిర్ణీత గడువు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు అధికారులు నివేదించారని తెలిసింది.
దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దృష్టి సారించింది. ఉప ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇతర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెప్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే…. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పారని సమాచారం. దీంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో బద్వేలు, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ లేదా నవంబర్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.