రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిస్తామని సగర్వంగా ప్రకటించి దానిని చట్టం రూపంలో కూడా తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. అయితే అన్ని చట్టాలు పూర్తిస్థాయిలో అమలవుతాయా అంటే చెప్పలేం. ప్రస్తుతం ఈ స్థానిక రిజర్వేషన్ చట్టానికి కూడా కార్పొరేట్ కంపెనీలు మోకాలడ్డేందుకు సిద్ధమయ్యాయి. నేరుగా జగన్ తో చర్చించే ధైర్యంలేక, మంత్రులు ఇతర అధికారులు నేతల దగ్గర తమగోడు వెళ్లబోసుకుంటున్నాయి. తాజాగా జిల్లాల్లో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల్లో ఈ విషయం బైటపడింది.
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా.. కొన్ని కంపెనీల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. జగన్ స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని చెబుతూనే.. పరిశ్రమల నిర్వాహకులు తమకు టాలెంట్ కావాలని అడుగుతున్నారని, వారి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు 75శాతం ఉద్యోగాలివ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన సందర్భంలో వీరు కంపెనీల బాధను ఏకరువు పెడుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత 75శాతం నిబంధన పూర్తిస్థాయిలో అమలులోకి తెస్తామని చెప్పారు. అంటే ఒకరకంగా ఈ రిజర్వేషన్లు వాయిదా పడ్డట్టే. గతంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నా.. ఎక్కడా స్థానికంగా అమలు అయిన దాఖలాలు లేవు. స్థానికులు ఇచ్చిన భూముల్లో కంపెనీలు పెట్టి, కాలుష్యం వంటి దుష్ప్రభావాలుంటే అవి వారికే అంటగట్టి, నిత్యం వారి మధ్యనే ఉంటూ, వారికి స్వీపర్, వాచ్ మెన్ వంటి ఉద్యోగాలిస్తూ కొన్ని కంపెనీలు ఇబ్బందులు పెట్టేవి.
ఇలాంటి వాటివల్ల రాష్ట్రంలో ఎన్ని కంపెనీలున్నా నిరుద్యోగ సమస్య తీరడంలేదు. దీన్ని నివారించడానికే ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశారు. అయితే కంపెనీలు మరో ఎత్తుగడ వేశాయి. ఎప్పటిలాగే టాలెంట్ సాకు చూపించి స్థానికులకు ఉద్యోగాలివ్వడానికి మొహం చాటేస్తున్నాయి.
ఇలాంటి కంపెనీలకు మంత్రులు వత్తాసు పలికితే స్థానిక అసంతృప్తి ఎప్పటికీ చల్లారదు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఉద్యోగాల కల్పనపై నివేదికలు తెప్పించుకుని సమీక్షలు జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్ర యువతకు న్యాయం జరుగుతుంది, జగన్ స్ఫూర్తి నిలబడుతుంది.