జ‌న‌సేన గొంతు పిసికేదెవ‌రు?

జ‌న‌సేన‌కు నిజ‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసుకోలేని స్థితిలో ఆ పార్టీ నేత‌లున్నారు. త‌మ పార్టీపై జ‌నాద‌ర‌ణ‌కు సంబంధించి జ‌న‌సేన నాయ‌కులు చాలా ఎక్కువ ఊహించుకుంటున్న‌ట్టు నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. కాపు మంత్రుల‌పై…

జ‌న‌సేన‌కు నిజ‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసుకోలేని స్థితిలో ఆ పార్టీ నేత‌లున్నారు. త‌మ పార్టీపై జ‌నాద‌ర‌ణ‌కు సంబంధించి జ‌న‌సేన నాయ‌కులు చాలా ఎక్కువ ఊహించుకుంటున్న‌ట్టు నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. కాపు మంత్రుల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడుల‌కు తెగ‌బ‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు ఏపీ నిఘా విభాగం ప్ర‌భుత్వానికి ఓ నివేదిక స‌మ‌ర్పించింది.

ఈ నివేదిక‌పై జ‌న‌సేన ఉలిక్కి ప‌డుతోంది. నివేదిక బ‌హిర్గ‌తం కావ‌డంపై జన‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సీరియ‌స్‌గా స్పందించారు. అయితే ఆయ‌న కామెడీ చేశారు. ర‌హ‌స్యంగా ఉండాల్సిన నివేదిక లీక్ కావ‌డంపై స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంత వ‌ర‌కూ ఓకే.

ఆయ‌న ఒక అడుగు ముందుకేసి కామెడీ పండించారు. జ‌న‌సేన నాయ‌కుల ఫోన్ల‌పైనే కాకుండా ఇలాంటి వ్య‌వ‌హారాల‌పై కూడా నిఘా ఉంచాల‌ని ఆయ‌న డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి సూచించ‌డం గ‌మ‌నార్హం. త‌మ పార్టీ గురించి నాదెండ్ల ఏమ‌నుకుంటున్నారో గానీ, ఆయ‌న మాటలు వింటున్న జ‌నం మాత్రం న‌వ్వుకుంటున్నారు. పార్టీ స్థాపించి 9 ఏళ్లు గ‌డుస్తున్నా, ఇప్ప‌టికీ స‌రిగ్గా 20 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిలిపే దిక్కు లేదు. అలాంటి పార్టీకి నాయ‌కులున్నార‌ని, వారిపై ప్ర‌భుత్వం నిఘా పెట్టింద‌ని నాదెండ్ల ఊహించుకుని పెద్ద‌పెద్ద మాట‌లే మాట్లాడారు.

మంత్రుల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడులు చేసే అవ‌కాశం వుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. ఇంటెలిజెన్స్ పేరుతో జ‌న‌సేన‌పై మ‌రో కుట్ర జ‌రుగుతోంద‌ని ఆయ‌న వాపోయారు. జ‌న‌సేన‌కు వ‌చ్చే ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాదెండ్ల దృష్టిలో వైసీపీ మాత్ర‌మే శ‌త్రువు కావ‌చ్చు.

కానీ క‌నిపించ‌ని శ‌త్రువు టీడీపీ అని గ్ర‌హిస్తే మంచిది. రాజ‌కీయాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒక పార్టీ మ‌రో పార్టీ ఉన్న‌తిని కోరుకోద‌ని క‌నీసం నాదెండ్ల అయినా గ్ర‌హించి త‌మ అధినేత ప‌వ‌న్‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తే మంచిది. లేదంటే చేజేతులా పార్టీ గొంతును ప‌వ‌నే పిసికేసే ప‌రిస్థితిని చంద్ర‌బాబు తీసుకొస్తారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఎదురు కాకుండానే జ‌న‌సేన మేల్కొంటే మంచిది.