అప్పుడు ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు గ్రామ సచివాలయం

ఒక పథకం ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించింది. మరో పథకం యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తోంది. ఒక పథకం వైఎస్ఆర్ ను హీరోను చేస్తే, మరో పథకం జగన్ కు ప్రజల గుండెల్లో సుస్థిర…

ఒక పథకం ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించింది. మరో పథకం యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తోంది. ఒక పథకం వైఎస్ఆర్ ను హీరోను చేస్తే, మరో పథకం జగన్ కు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించింది. అవే ఆరోగ్యశ్రీ. గ్రామ సచివాలయం. గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం, అధికార వికేంద్రీకరణ ఆలోచనలు.. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న వేళ.. ఒకప్పటి ఆరోగ్యశ్రీతో గ్రామసచివాలయ కార్యక్రమాన్ని పోల్చిచూస్తున్నారు చాలామంది.

ఆరోగ్యశ్రీ.. ఈ ఒక్క ప్రొగ్రామ్ స్వర్గీయ వైఎస్ఆర్ ను ప్రజల్లో దేవుడిగా మార్చేసింది. ప్రతి మనిషికి ఆరోగ్య భద్రతకు కల్పించిన ఈ పథకం వైఎస్ఆర్ ను మరోసారి అధికారంలోకి కూడా తీసుకొచ్చింది. సరిగ్గా అలాంటి ఫ్లాగ్ షిప్ కార్యక్రమమే గ్రామ సచివాలయం కూడా. ఈ రెండు కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. అప్పుడు వైఎస్ఆర్ ను, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ ను చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచేలా చేస్తున్నాయి.

అప్పుడు తండ్రికి ఆరోగ్యశ్రీ కలిసొచ్చినట్టు, ఇప్పుడు తనయుడు జగన్ కు గ్రామ సచివాలయం కార్యక్రమం కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలు, సొంత ఊరిలోనే ఉద్యోగం, కనీస ఉద్యోగ భద్రత.. ఏ యువకుడికైనా ఇది చాలు. యువత సంతృప్తిగా ఉంటే ఆ కుటుంబం సంతృప్తిగా ఉన్నట్టే. కొన్ని లక్షల కుటుంబాలు సంతృప్తిగా ఉంటే రాష్ట్రం సంతృప్తిగా ఉన్నట్టే. జగన్ ఇదే పని చేశారు. గ్రామ వాలంటీర్లు, సెక్రటరీ పోస్టుల భర్తీతో లక్షల మంది కళ్లల్లో వెలుగు నింపుతున్నారు.

ప్రతి కార్యక్రమంలో లోపాలు ఉన్నట్టే ఇలాంటి భారీ పథకాల్లో కూడా లోపాలు కనిపించాయి. ఆరోగ్యశ్రీ పెట్టిన కొత్తలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆసుపత్రి యాజమాన్యాలు అడ్డంతిరిగాయి. చివరికి వాహనాలకు డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. ఇలాంటి ఎన్నో సవాళ్లు, ఆటంకాలను అధిగమించి దాన్ని సూపర్ హిట్ చేశారు వైఎస్ఆర్. గ్రామ సచివాలయాల విషయంలో కూడా జగన్ అదే పని చేస్తున్నారు.

ఇందులో కూడా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. గ్రామ స్థాయిలో చూసుకుంటే ఒక్కో గ్రామంలో ఒక్కో సమస్య కనిపిస్తుంది. అన్ని గ్రామాల్ని ఒకే గాటన కట్టి నిర్ణయం తీసుకోలేం. మరీముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణాలు కూడా చూసుకోవాలి. దీనికితోడు కొన్ని గ్రామాల్లో వాలంటీర్లుగా పనిచేసేందుకు కొంతమంది యువత ముందుకురాని పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆర్థిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన ఈ కార్యక్రమానికి గుదిబండగా మారాయి. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు జగన్.

ఆరోగ్యశ్రీ విషయంలో వైఎస్ఆర్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. దాదాపు అధికారంలో ఉన్నన్ని రోజులు, ప్రతిరోజు ఈ పథకంపై సమీక్ష నిర్వహించేవారు. పొద్దున్న లేస్తే వైఎస్ఆర్ కు ఇదే ఆలోచన. అంత అకుంఠిత దీక్షతో పనిచేశారాయన. ఓవైపు జలయజ్ఞం లాంటి భారీ పథకం కొనసాగుతున్నప్పటికీ, ఆరోగ్యశ్రీని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. సరిగ్గా ఇలాంటి క్రమశిక్షణ, నిబద్ధతనే వైఎస్ జగన్ కూడా చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇతర పథకాలు ఉన్నప్పటికీ.. గ్రామ సచివాలయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఎందుకంటే.. ఇది కేవలం ప్రజాభివృద్ధికి సంబంధించిన పథకం మాత్రమే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కూడా నిర్దేశించే కార్యక్రమం. ఇది హిట్ అయితే జగన్ ప్రభుత్వానికి మరో దశాబ్దం వరకు ఢోకా ఉండదు. 

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?