హీరోయిన్ గా అవకాశం రావాలంటే కొన్ని తెరచాటు కార్యక్రమాలు చేయాల్సిందేనంటూ ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు బయటపడ్డారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఏ స్థాయి వరకు వెళ్లిందో విడమర్చి చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఇది సినీపరిశ్రమకే పరిమితం కాదు, టీవీ రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం ఉత్తరాదిన జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేశాయి. దక్షిణాదిన ఇలాంటి ఘటనలు బయటపడిన సందర్భాలు తక్కువ. అయితే సీరియల్స్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని అంటోంది బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ రోహిణి.
బిగ్ బాస్ హౌజ్ నుంచి తాజాగా ఎలిమినేట్ అయ్యారు రోహిణి. సీరియల్స్ తో పాపులర్ అయిన ఈమె తన రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ స్టార్టింగ్ లో తను ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.
“బీటెక్ అయింది. ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాను. ఓ సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతల్ని వెళ్లి కలిశాను. ఏకంగా ఇద్దరు నన్ను కమిట్ మెంట్ అడిగారు. అక్కడ్నుంచి వచ్చేశాను. తర్వాత మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైంది. వయసులో చాలా పెద్ద వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు. అవకాశం ఇస్తాను, నాకేం ఇస్తావ్ అంటూ డైరక్ట్ గా అడిగాడు.”
ఇలాంటి ఎన్నో అనుభవాల నుంచి బయటపడి ఇప్పుడు నలుగురు మెచ్చుకునే స్థితికి చేరుకున్నానని అంటోంది రోహిణి. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో ఉందంటున్న ఆమె, గ్లామర్ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని బయటపెట్టిన రోహిణి, కమిట్ మెంట్ అడిగిన ఆ వ్యక్తుల వివరాలు, ఛానెల్ పేర్లు మాత్రం వెల్లడించలేదు.