ప్లీజ్ నమ్మండి.. ప్రభుత్వమే ముంచింది!

వరద రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. నష్టపోయిన కొందరితో మాట్లాడారు. అయితే అడుగడుగునా ఆయన తాపత్రయం ఒక్కటే అన్నట్లుగా కనిపించింది. ఈ వరదలు…

వరద రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. నష్టపోయిన కొందరితో మాట్లాడారు. అయితే అడుగడుగునా ఆయన తాపత్రయం ఒక్కటే అన్నట్లుగా కనిపించింది. ఈ వరదలు ప్రకృతి వల్ల రాలేదు.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ ముంపు ప్రమాదాన్ని సృష్టించింది. మిమ్మల్నిందరినీ నీళ్లలో ముంచేయడానికి ప్రభుత్వం కుట్రచేసింది అని ప్రజలను నమ్మించడానికి ఆయన చాలా చాలా ప్రయత్నించారు.

వరద పరిస్థితులు కృష్ణా పరీవాహక ప్రాంతాలను చుట్టుముట్టిన సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో లేరు. నదిని ఆక్రమించుకుని కట్టుకున్నందుకు తను ఉంటున్న ఇల్లే మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకోగా… ఆయన హైదరాబాదుకు పలాయనం చిత్తగించారు. పరిస్థితులు అంతా చక్కబడిన తర్వాత.. ఆయన తిరిగి విజయవాడ వచ్చారు. రాగానే ప్రజలను పరామర్శించే మిష మీద పల్లెల్లో తిరిగారు. కానీ ప్రతిచోటా.. జగన్మోహన రెడ్డే వరదలను సృష్టించాడు అన్నట్లుగా ప్రజలను నమ్మించడానికి ఆయన చేసిన ప్రయత్నం మాత్రం నవ్వులపాలైంది.

వరద వంటి విపత్తులు చుట్టుముట్టినప్పుడు.. చంద్రబాబునాయుడే కదా.. నాయకుల్లో ఎవరు వచ్చి పలకరించినా.. ప్రజలు గొల్లుమని తమ విలాపాలను ఏకరవు పెట్టడం చిత్రమేమీకాదు. అందుకు వారిని తప్పుపట్టలేం. ఏ చిన్నసాయం అందినా.. తమకు ఉపకరిస్తుందనే ఆశతో వారు ఉంటారు. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారు. వరద బాధితుల గోడును కూడా రాజకీయంగా లబ్ధిగా మార్చుకోవాలనే బురదబుద్ధులను చంద్రబాబు ప్రదర్శించారని అంతా అనుకుంటున్నారు.

నిజంగా ప్రజలు బాధలు పడుతోంటే.. వాటిని నివారించడానికి ప్రభుత్వంతో పోరాడాలి. పంటలు నష్టపోయిన విషయం తాను గమనిస్తే.. ప్రభుత్వం అందిస్తున్న పరిహారానికి మించి.. వారికి నష్టం జరిగి ఉంటే.. ఆ మేరకు దానికోసం పోరాడాలి. వరద సహాయక కార్యక్రమాలు సరిగా జరగకపోతే నిరసించాలి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఆ పనులు చేయాలి.

కానీ ఆయన టూరు అలాలేదు. ‘ఇలాంటి పాలకులు మనకొద్దు. మీ కష్టాలకు ప్రకృతి కారణం కాదు… ప్రభుత్వమే కారణం… నా మీద కక్ష కట్టి మీ ఊర్లన్నీ ముంచేస్తున్నారు…’’ ఇలా సాగిపోయింది. ఈ వక్రబుద్ధులను చంద్రబాబు మానుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. బురద రాజకీయాలు మానుకుని.. ప్రజలకు ప్రభుత్వసాయం అందకుంటే దానికోసం ప్రయత్నిస్తే మంచిదని హితవు పలుకుతున్నారు.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?