ఆయన హై కమాండ్ కూ అదే మాట చెబుతాడా?

మునుగోడులో కోమటిరెడ్డి సోదరుల్లో ఒకడైన భువనగిరి ఎంపీ వెంకట రెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్ కే పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే కదా. ఆయన వైఖరి చూస్తుంటే పార్టీని విడిచిపెట్టిపోయే ప్లాన్ లో…

మునుగోడులో కోమటిరెడ్డి సోదరుల్లో ఒకడైన భువనగిరి ఎంపీ వెంకట రెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్ కే పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే కదా. ఆయన వైఖరి చూస్తుంటే పార్టీని విడిచిపెట్టిపోయే ప్లాన్ లో ఉన్నట్లు కనబడుతోంది. పార్టీ ఓటమికి ఆయన కంకణం కట్టుకున్నాడని అనిపిస్తోంది. పార్టీ స్టార్ కాంపైనర్ అయిన వెంకట్ రెడ్డి ప్రచారాన్ని అటక ఎక్కించి  ఆస్ట్రేలియా చెక్కేసిన సంగతి తెలిసిందే కదా. పోయిన వాడు పోకుండా అక్కడికెళ్లి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల్లో పార్టీకి దూరంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే ఆయన వైఖరి ఉంది.

మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని అన్నాడు. తాను అక్కడ ఉండి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదన్నాడు. ప్రచారం చేసినా వస్తే 10 వేల ఓట్ల వరకు వస్తాయని కామెంట్ చేశాడు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదన్నాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నాడని  జోస్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పైగా తన తమ్ముడికి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. నిజంగా ఇది బాధ్యతా రాహిత్యమనడంలో సందేహం లేదు. పార్టీకి ద్రోహం కూడా. ఇదంతా అధిష్టానానికి  తెలియకుండా ఉంటుందా? వెంకటరెడ్డి ద్రోహం గురించి అధిష్టానానికి తెలిసిపోయింది.

దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారం నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పార్టీ  ఆదేశించింది. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే మునుగోడు నియోజకవర్గానికి చెందిన  కాంగ్రెస్ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో వెలుగు చూసింది. పార్టీని చూడవద్దని ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరాడు. 

అస్ట్రేలియా టూర్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనను కలిసిన అభిమానులతో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని ఆయన  తేల్చి చెప్పాడు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ  కార్యదర్శులు విచారణ నిర్వహించి  పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ క్రమ:శిక్షణ సంఘానికి సమాచారం ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. ఆగస్టు 5న చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో తనను అద్దంకి దయాకర్ దూషించడంతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చేసిన హోంగార్డు,ఎస్పీ వ్యాఖ్యలతో  ప్రచారానికి వెళ్లడం లేదని  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి తేల్చి చెప్పాడు.

మునుగోడు ప్రచారానికి  వెళ్లకుండా తన అనుచరులకు ఫోన్లు చేస్తూ బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేయడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మునుగోడులో చావో రేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  పనిచేస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వ్యవహరిస్తున్న తీరు పార్టీకి  నష్టం  కలిగించేలా  ఉందనే  అభిప్రాయంతో  పార్టీ  నాయకత్వం  ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా నేత వ్యాఖ్యానించి ఉంటే ఈ పాటికి ఆ నేతను బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసేవారు. డిపాజిట్లు రావడం కష్టమైన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ నేతలు ఓడిపోయే సీటులో పోటీ ఎందుకు.. ప్రచారం ఎందుకు అని బయటకు వినిపించేలా మాట్లాడిన మరుక్షణం వారికి పార్టీలో చోటు ఉండదు. 

కానీ సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఓడిపోతే  గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడిన నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పదంగా మారాడు.   కాంగ్రెస్ పార్టీని దారుణంగా అవమానించాడు.   అయినా కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. కాంగ్రెస్‌ది నిస్సహాయతా ? పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిసినా ఏమీ అనలేకపోతున్నారా ? అంతర్గత ప్రజాస్వామ్యం కాస్తా శ్రతి మించిన క్రమశిక్షణా రాహిత్యం అని అనిపించడం లేదా ? వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నేత. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన కుటుంబం అపర కుబేరులయ్యారని నల్లగొండ జిల్లా  మొత్తం చెప్పుకుంటారు.

అయితే కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ సోదరుల వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణించాక తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అధికారం పోయిన తర్వాత  మరింతగా మారిపోయింది. ఎన్నికలైపోగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలో చేరిపోవడానికి ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ఆయన చెప్పుకున్న ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో ఆ చేరిక ఆగిపోయింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు కానీ.. కనీసం చర్యలు తీసుకోలేకపోయారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎప్పుడూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించని వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. 

నిజానికి పీసీసీ చీఫ్ పదవిలో ఎవరు ఉన్నా… సోదరులిద్దరూ అసంతృప్తిగానే ఉంటారు. పొన్నాల లక్ష్మయ్య ఆ పదవిలో ఉన్నప్పుడు దండయాత్ర చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడూ అదే పరిస్థితి. తమకే పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే రేవంత్ రెడ్డికి చాన్సివ్వడంతో కోమటిరెడ్డి.. మాణిగం ఠాగూర్ క్యారెక్టర్ పైనే ఆరోపణలు చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. దీంతో కోమటిరెడ్డి సోదరులకు మరింత ధైర్యం పెరిగింది. తాము ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి చర్యలు తీసుకునే ధైర్యం లేదనుకున్నారు.

మునుగోడు ఉపఎన్నిక వెనుక ప్రధాన వ్యూహం .. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం. సిట్టింగ్ సీటులో ఆ పార్టీ రేసులో లేదని తేల్చడం ద్వారా..  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు జరుగుతున్నట్లుగా రాజకీయం మార్చాలనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషణలు చేసి దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉపఎన్ని క పరిణామాలు చూస్తే అర్థం అయిపోతుంది. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా.. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి కోమటిరెడ్డి సోదరులే ప్లాన్ చేశారని అనుకోవాలి.