ఆడియో లీక్‌పై సీరియ‌స్‌!

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భాగంగా అనేక చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్త‌వాదులు పార్టీలు మార‌డం, అలాగే పార్టీలో వుంటూ మ‌రోపార్టీకి స‌హ‌క‌రించ‌డం త‌దిత‌ర ప‌రిణామాల్ని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డికి అంద‌రూ…

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భాగంగా అనేక చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్త‌వాదులు పార్టీలు మార‌డం, అలాగే పార్టీలో వుంటూ మ‌రోపార్టీకి స‌హ‌క‌రించ‌డం త‌దిత‌ర ప‌రిణామాల్ని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డికి అంద‌రూ ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆడియో తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ ఆడియో గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంలోనిద‌ని వెంక‌ట‌రెడ్డి అనుచ‌రులు చెబుతున్న‌ప్ప‌టికీ, కాంగ్రెస్ హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకుంది. అస‌లే ఈ ఉప ఎన్నిక ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కమైంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. నిజానికి ఈ సీటు కాంగ్రెస్‌దే. ఆ పార్టీ త‌ర‌పున ఎన్నికై, తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో భాగంగా రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అనంత‌రం బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీ త‌ర‌పున త‌ల‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై కోపం, త‌మ్ముడిపై అభిమానంతో ఉప ఎన్నిక‌కు వెంక‌ట‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. కానీ పార్టీ ఏద‌ని చూడ‌కుండా, ప్ర‌తి ఒక్క‌రూ త‌న త‌మ్ముడికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆయ‌న విన్న‌పానికి సంబంధించిన ఆడియోపై కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది.

ప‌ది రోజుల్లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో ఏఐసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నోటీసులు జారీ చేసింది. వెంక‌ట‌రెడ్డి వివ‌ర‌ణ‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. మునుగోడు ఫ‌లితం చూసి, ఆయ‌న కూడా రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌న‌సులో ఉద్దేశం అయితే కాంగ్రెస్ మ‌రో కీల‌క నాయ‌కుడిని పోగొట్టుకున్న‌ట్టే.