వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్ద‌నుకుంట‌న్నాః ఏపీ మంత్రి

ఏపీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయొద్ద‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని విష‌య‌మై ఆయ‌న గ‌ట్టి…

ఏపీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయొద్ద‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని విష‌య‌మై ఆయ‌న గ‌ట్టి స్వ‌రాన్ని వినిపిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే రాజీనామాకు కూడా సిద్ధ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని వ‌ద్దంటూ అర‌స‌వెల్లికి పాద‌యాత్ర‌గా వ‌స్తుండ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. ఇటీవ‌ల కాలంలో ఉత్త‌రాంధ్ర‌కు జ‌రుగుతున్న అన్యాయంపై బ‌ల‌మైన గొంతుక వినిపిస్తున్న వారిలో ధ‌ర్మాన మొద‌టి వ‌రుస‌లో ఉన్నారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న త‌న‌వైన అభిప్రాయాల్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని వ‌ద్ద‌ని చెప్పే వాళ్లెవ‌రైనా ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నట్టే లెక్క అని అన్నారు.

ఇడుపుల‌పాయలో రాజ‌ధాని పెట్టాల‌ని జ‌గ‌న్ కోరుకోవ‌డం లేద‌న్నారు. విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధాని పెడితే టీడీపీకి అభ్యంత‌రం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. విశాఖ‌కు రాజ‌ధాని యోగం వ‌స్తున్న సమ‌యంలో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన టీడీపీ నాయ‌కులు నోరు మెద‌ప‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేవ‌లం చంద్ర‌బాబు ప్రాప‌కం కోసం వెంపర్లాడే నాయ‌కులే రాజ‌ధాని వ‌ద్దంటున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

23 కేంద్ర సంస్థ‌ల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఉత్త‌రాంధ్ర‌లో పెట్ట‌లేద‌ని ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఉత్త‌రాంధ్ర కోసం ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు మాట్లాడ్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నాయ‌కుడవుతాడ‌ని ఆలోచ‌న చేయ‌వ‌ద్ద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన తేల్చి చెప్పారు. ధ‌ర్మాన ప్ర‌క‌ట‌నపై అంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. కుమారుడిని రంగంలోకి దింప‌డానికి ధ‌ర్మాన త‌ప్పుకుంటున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.