వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డికి… భాజపా సర్కారులోని పెద్దలతో సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన తరచూ వారిని కలుస్తూ ఉంటారు. పైగా పార్లమెంటులో పార్టీకి ప్రతినిధి కూడా ఆయనే. అయితే ఆయన వైఎస్ జగన్మోహన రెడ్డికి కూడా ఆపాదిస్తూ చెబుతున్న మాటలు ప్రజలకు కొత్త సందేహాలు కలిగించేలా కనిపిస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేవే.
పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కేంద్రంలోని భాజపా నుంచి తమకు పుష్కలంగా ఆశీస్సులు ఉంటున్నాయి… అంటున్నారు. అదే సమయంలో.. ఇక్కడ రాష్ట్రంలో భాజపా నాయకులు మాత్రం.. వైఎస్ జగన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. జగన్ సర్కారు తీసుకుంటున్న దాదాపుగా ప్రతినిర్ణయాన్నీ వారు తప్పు పడుతున్నారు. తూర్పార పడుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వం తీరుపట్ల కొత్త భయాలను రేకెత్తిస్తున్నారు.
నిజానికి రాష్ట్రంలో భాజపా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అడ్డగోలుగా దాడిచేస్తోంది. కనీసం ప్రభుత్వంలో లోపాలు దొర్లుతోంటే.. చక్కదిద్దడానికి ప్రయత్నించే నిర్మాణాత్మక ప్రతిపక్షంలాగా కూడా కాదు.. చవకబారు విమర్శలకు దిగుతోంది. అమెరికా కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేయకుండా.. హిందువుల మనోభావాలు గాయపరిచారంటూ.. అక్కడికేదో తాము హిందువులందరికీ ఉద్ధారకులు అయిన రేంజిలో జగన్ మీద దిగజారుడు వ్యక్తిగత విమర్శలు చేస్తోంది రాష్ట్ర భాజపా.
మరి కేంద్రంలో మాకు మోడీ, షా ఆశీస్సులు ఉన్నాయంటూ వారిని మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి మద్దతు, సహకారం ఉంటే చాలు. ఆశీస్సులు వ్యక్తులకు కావాలి. వ్యక్తిగతం విజయసాయికి వారి ఆశీస్సులు అవసరమైతే కావొచ్చు గాక.. అంతే తప్ప.. వాటిని జగన్ కు ముడిపెట్టి, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టి మాట్లాడడం మాత్రం కరెక్టు కాదు. అలాగే… పైన ఆశీస్సులు ఉన్నాయని అంటున్న వాళ్లు.. కిందస్థాయిలో పార్టీ కస్సుబుస్సులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్నది కూడా అర్థంకాదు.