ఈరోజు సాక్షి.. ఆంధ్రజ్యోతి పత్రికలు రెండూ చూసిన తెలుగు పాఠకులు కాస్త బుర్ర గోక్కోవాల్సిందే. అసలేం జరుగుతోందో తెలియక అయోమయపడాల్సిందే. ఆంధ్రలో అల్లకల్లోలం అయిపోతోంది. రాజధానిని మార్చేస్తున్నారా? కేంద్రం రాష్ట్రం మీద కన్నెర్రగా వుందా? దక్షిణ కోస్తాలో వరదలు కావాలని సృష్టించినవా? ఇంకా ఇంకా అనేకానేక ప్రభుత్వ వ్యతిరేక కథనాలు.
ఇందంతా ఆంధ్రజ్యోతిలో. మరి సాక్షిలో ఏముంది? రాష్ట్రం అంతా ప్రశాంతంగా వుంది. ఎక్కడా ఏ సమస్యాలేదు. ఈ మేరకు కథనాలు లేవు కానీ, సాక్షిపత్రిక చదివితే ఇలాంటి ప్రశాంతతే కనిపిస్తుంది. అసలు ప్రతిపక్షాల విమర్శకు స్థానం లేదు. అసలేమిటి? ఆంధ్రలో నిజంగా ఏం జరుగుతోంది? ప్రభుత్వం తరపున ఎవ్వరూ నోరు మెదపరేం? మంత్రులు ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్లు మాట్లాడడం ఏమిటి? విపక్షాల విమర్శలను అధికారికంగా తిప్పికొట్టే వ్యవహారం ఎక్కడన్నా నడుస్తోందా?
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో వున్నారు. ఒకవేళ ఆయన ఇక్కడ వున్నా, అసెంబ్లీలో మాట్లాడుతారు తప్ప, మామూలుగా లోకల్ మీడియాతో మాట్లాడి, వాస్తవాలు వివరించి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇచ్చయే గాక నాకేటి వెరపు' అనే టైపు. తన పంతం, తన మొండితనం, తన ఇచ్ఛ.. తనదే తప్ప, దానివెనుక వున్న కారణాలు, సహేతుకతను సవివరంగా వివరించే వ్యవహార శైలి వున్న నేత కాదు.
ఎవరైనా ఒకదాని తరువాత ఒకటి పరిష్కరించడమో, లేదా తలకెత్తుకోవడమో చేస్తారు. కానీ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు. పొలవరం టెండర్లు, పిపిఎలు, కరకట్ట నిర్మాణాలు, రాజధాని వ్యవహారాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు నిలిపివేత ఇలా ఒకటేమిటి సమస్తమూ ఒకేసారి తలకెత్తుకుంది. దీనివల్ల ఒకేసారి అనేకానేక అంశాలపై గగ్గోలు.
ఒక్కదానికి ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం వచ్చిన దాఖలా వుందా? వరద ముంపు వచ్చింది ఇలా? వరద నీటి మేనేజ్మెంట్ జరిగింది ఇలా? అని ప్రభుత్వం వైపు నుంచి లెక్కలు, సాక్ష్యలతో మాట్లాడిన వైనం వుందా? బాధితుల దగ్గరకు మంత్రులు వెళ్లి, ఓదార్చి, సాయం ప్రకటించిన వ్యవహారం వుందా? వ్యవసాయ మంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించిన దాఖలా వుందా?
మన పత్రికలో రాయనంత మాత్రాన ప్రతిపక్షాల గొంతు ప్రజలకు చేరదు అనుకోవడానికి లేదు. గత అయిదేళ్లలో తెలుగుదేశం మీడియా అలాగే చేసింది. కానీ జగన్ గొంతు ప్రజలకు చేరింది. ఈ సంగతి తెలిసీ జగన్ పార్టీ, ఆయన పత్రిక అదే తప్పు చేస్తున్నాయి. వైకాపా వ్యతిరేక మీడియా ఇప్పుడు మూడు నాలుగు పాయింట్లు కీలకంగా పెట్టుకుని పని చేస్తున్నాయి.
ఒకటి.. భాజపాకు వైకాపాకు మధ్య ఎడం పెంచాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య శతృత్వం పెరగాలి.
రెండు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాస్త మద్దతు ఇవ్వాలి.
మూడు. ప్రజల్లో వైకాపా పాలన అంటే అనుభవరాహిత్యం, తుగ్లక్ వ్యవహారాలు అన్న కలరింగ్ రావాలి.
వీటన్నింటి వల్ల సిద్దించే, ఆశించే ప్రయోజనం ఒకటే. భాజపాకు మరో గత్యంతరం లేక మళ్లీ తెలుగుదేశంతో కలుస్తుంది. కేంద్రం కన్నెర్ర చేస్తే, జగన్ కేసులు తిరగతోడి, బెయిల్ రద్దుచేసి, ఇంకేమన్నా జరగొచ్చు. పవన్ బలోపేతమై తేదేపాతో మళ్లీ కలిస్తే లాభం వుంటుంది. భాజపా.. జనసేన.. తేదేపా ఒకటైతే వైకాపాను ఓడించేందుకు సరిపడా బలం వస్తుంది. అదే సమయంలో వైకాపా అనుభవ రాహిత్య పాలన ప్రజలకు విసుగు పుట్టిస్తుంది.
ఇంతటి బహుళార్థక ఎజెండా పెట్టుకుని, తేదేపా అనుకూల మీడియా ముందుకు వెళ్తుంటే, వైకాపా అనుకూల మీడియా, తమ కళ్లకు గంతలు కట్టుకున్నట్లు, చేష్టలుడిగినట్లు, సూక్తి ముక్తావళి వార్తలు ప్రచురించుకుంటూ ముందుకు వెళ్తోంది. దీనికి కారణం, ప్రభుత్వం వైపు నుంచి కానీ, పార్టీ వైపు నుంచి కానీ సరైన ఖండనలు, లేదా వివరణలు రావడంలేదు. దాంతో ప్రచురించేందుకు వీలైన మెటీరియల్ దొరకడం లేదు. ముఖ్యమంత్రి విదేశాల్లో వున్నారు. ఇక్కడ మంత్రివర్గం 'నందోరాజా భవిష్యతి' అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదంతా వైకాపా చేతులు కాలడానికే దారితీస్తుంది. కానీ తీరా కాలిన తరువాత ఇంకేం చేయడానికి వుండదు. ఆ సంగతి ఎంత త్వరగా గమనించుకుంటే అంత మంచింది.
-ఆర్వీ