దేశంలో గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించి నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 41 వేలు కాగా, అందులో కేరళ వాటా ఏకంగా 30 వేల స్థాయిలో ఉంది! మిగతా దేశం మొత్తం మీదా కేవలం 10వేల కొత్త కేసులు వస్తే, కేరళ దానికి మూడు రెట్ల కరోనా కేసులను నమోదు చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గాయి. దక్షిణాదిన కూడా కేసుల సంఖ్య పెద్దగా లేదు. కర్ణాటక, ఏపీ, తమిళనాడుల్లో రోజుకు వెయ్యి, పన్నెండు వందల స్థాయిలో కేసులు వస్తున్నాయి. అయితే కేరళ మాత్రం మిగతా దేశాన్ని ఇప్పుడు భయపెడుతూ ఉంది.
కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. బహుశా మూడో వేవ్ కు కేరళ హాట్ స్పాట్ అవుతోందా? అక్కడ నుంచినే మళ్లీ దేశమంతా కరోనా తీవ్ర రూపం దాలుస్తుందా? అనే భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాదాపు నెల నుంచి కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే కాస్త తగ్గుతూ కూడా ఉంది. ఈ హెచ్చుతగ్గులలో కూడా దేశంలోనే అత్యధిక కేసుల రాష్ట్రంగా మాత్రం కేరళ నిలుస్తూ ఉంది.
దేశంలో కరోనా కేసులు అత్యంత ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతం రోజువారీ కేసులు నాలుగైదు వేల స్థాయిలో ఉన్నాయి. కేరళ, మహారాష్ట్రలు కలిపి.. దాదాపు 90 శాతం కేసులను నమోదు చేశాయి గత ఇరవై నాలుగు గంటల్లో. ఐదు శాతం కేసులు ఏపీ, తమిళనాడు, కేరళల్లో నమోదయ్యాయి. మిగిలిన కేసులు మిగతా రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.
కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చే వారిపై మిగతా రాష్ట్రాలు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ విషయంలో బాగా భయపడుతోంది కర్ణాటక. కేరళ నుంచి బెంగళూరుకు, కర్ణాటకలోకి ప్రవేశించే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని కర్ణాటక ప్రకటించింది. వ్యాక్సినేషన్ స్టేటస్, కరోనా టెస్టు..అది కూడా ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును కలిగి ఉన్న వారినే కేరళ నుంచి కర్ణాటకలోకి అనుమతిని ఇవ్వనున్నామని కర్ణాటక ప్రకటించింది.
తమిళనాడు మాత్రం ఈ విషయంలో ఇంకా స్పందించలేదు. మిగతా రాష్ట్రాలు కూడా కేరళ మీద కన్నేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్ప్రెడ్ ను ఆపాలంటే.. జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కేరళలో వరసగా పలు ఆంక్షలను సడలించేశారు. ముస్లిం పండగలకూ, హిందూ పండగలకు తేడా లేకుండా మినహాయింపులను అనౌన్స్ చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు భారీ స్థాయిలో కేసుల సంఖ్య రావడానికి కారణమేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.