తెలుగు సమాజం చూపంతా కడప జిల్లా ఇడుపులపాయపైన్నే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన చెల్లి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇద్దరూ వేర్వేరు సమయాల్లో ఇడుపులపాయకు చేరుకున్నట్టు సమాచారం. తమ తండ్రి వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించేందుకు అన్నాచెల్లెళ్లు అక్కడికి వెళ్లారు.
తెలంగాణలో షర్మిల సొంత కుంపటి పెట్టుకున్నప్పటి నుంచి జగన్‌తో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లు వేర్వేరుగా నివాళులర్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి అన్నాచెల్లెళ్లు ఇడుపులపాయకు చేరుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకుంది. ఈ నెల 2న ఉదయం 9.30 నుంచి 10.05 గంటల వరకు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. జగన్‌తో కలిసి షర్మిల, తల్లి విజయమ్మ నివాళులర్పిస్తారా? లేక గతంలో మాదిరిగానే వేర్వేరుగా పాల్గొంటారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
నిజంగానే అన్నాచెల్లెళ్ల మధ్య పరస్పరం ఎదురు పడలేని, మాట్లాడుకోలేని స్థాయిలో విభేదాలున్నాయా? అనే ప్రశ్నకు రేపటి నివాళి తగిన సమాధానం ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌కు జగన్ నివాళి అనంతరం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం నుంచి గన్నవరం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకల్లా ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు షర్మిల, విజయమ్మ కూడా ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. విజయలక్ష్మి గురువారం హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.