హీరో నానిపై ఎగ్జిబిటర్లు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ తర్వాత వాళ్లే తిరిగి నానికి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై నాని రియాక్ట్ అయ్యాడు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, తను ఓటీటీకి వెళ్తే.. అప్పుడు తనకు తానే స్వీయనిర్బంధం విధించుకుంటానని, సంచలన ప్రకటన చేశాడు.
“నా సినిమాల్ని థియేటర్లలో ఆపేస్తాం అని అన్నారు. నిజంగా బయట పరిస్థితులన్నీ బాగుండి, ఎలాంటి కరోనా భయాలు లేనప్పుడు నా సినిమా కనుక థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా, ఓటీటీలో వస్తే.. ఆ రోజున ఎవ్వరో వచ్చి నన్ను బ్యాన్ చేయనక్కర్లేదు. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను.”
టక్ జగదీష్ ట్రయిలర్ లాంఛ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు నాని. తప్పనిసరి పరిస్థితుల్లోనే టక్ జగదీష్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్న నాని.. ఎగ్జిబిటర్లపై తనకు గౌరవం ఉందంటున్నాడు.
“ఎగ్జిబిటర్లపై నాకు చాలా గౌరవం ఉంది. వాళ్లు ఉన్న పరిస్థితుల్లో నన్ను ఏదో అన్నారు. అందులో తప్పే లేదు. వాళ్లపై నాకు చాలా సానుభూతి ఉంది. కాకపోతే నేను కూడా వాళ్లలో ఒకడ్ని. ఆ కాసేపు నన్ను బయటోడ్ని చేసేశారు అనే బాధ నాక్కూడా ఉంది. నేను వాళ్లలో ఒకడ్ని అనే విషయాన్ని వాళ్లు గుర్తిస్తే చాలు. వాళ్ల బాధల్లో నేను కూడా ఉన్నాను.”
ఇలా ఎగ్జిబిటర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు నాని. 10వ తేదీన నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది టక్ జగదీష్ సినిమా. పండగతో ఈ సినిమా అందర్నీ కట్టిపడేస్తుందని అంటున్నాడు. శివనిర్వాణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు.