న్యాయరాజధాని ఏర్పాటులో భాగంగా జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) తాత్కాలిక కార్యాలయాన్ని బుధవారం ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. ఇటీవలే అదే గెస్ట్ హౌస్‌లో లోకాయుక్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాల్ చేస్తూ అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
ఇందులో భాగంగా హెచ్ఆర్‌సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కర్నూలులో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాల ఏర్పాటు అంశం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలులో నేడు హెచ్ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒక వైపు ప్రభుత్వం న్యాయ రాజధానిలో ఏర్పాటుగా భాగంగా ఈ రెండు కార్యాలయాలను ప్రారంభించలేదని చెబుతున్నప్పటికీ, ప్రజానీకం మాత్రం అలా భావించడం లేదు. ఎందుకంటే రెండు కార్యాలయాలు కూడా న్యాయపరమైన విభాగాలు కావడమే.
హైకోర్టులో స్టే నిరాకరించడంతో సగం విజయం సాధించినట్టైందని ప్రభుత్వం భావిస్తోంది. మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు చేయొచ్చని లోకాయుక్త, హెచ్ఆర్‌సీ హెడ్స్ చెబుతున్నారు. దీంతో ఆ సంస్థల కార్యకలాపాలు ప్రారంభమైనట్టే. ఈ సంస్థల ఏర్పాటుపై సీమ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.