2 లక్షల మందికి పింఛన్లు కట్..? ఇదెక్కడి గోల..!

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ పథకంలో అయినా లబ్ధిదారుల సంఖ్య పెరగడమే కానీ తగ్గింది లేదు. అయితే తొలిసారిగా సామాజిక పింఛన్ల విషయంలో లబ్ధిదారులు కొంతమంది ఇబ్బందుల్లో పడబోతున్నారు.  Advertisement కొంతమంది అంటే దాదాపుగా…

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ పథకంలో అయినా లబ్ధిదారుల సంఖ్య పెరగడమే కానీ తగ్గింది లేదు. అయితే తొలిసారిగా సామాజిక పింఛన్ల విషయంలో లబ్ధిదారులు కొంతమంది ఇబ్బందుల్లో పడబోతున్నారు. 

కొంతమంది అంటే దాదాపుగా 2లక్షల మంది అన్నమాట. వారందరూ పింఛన్లు కోల్పోతారనేది తాజా సమాచారం. అయితే వారంతా అనర్హులనేది ప్రభుత్వం వాదన. కాదు కాదు.. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలా పింఛన్లలో కోత పెడుతోందనేది ప్రతిపక్షం ఆరోపణ.. ఇంతకీ ఎవరిది నిజం, ఎంత నిజం..?

ప్రభుత్వం వాదన ఏంటంటే..?

ప్రభుత్వం తరపున ఇచ్చే సామాజిక పింఛన్లు అర్హులకే చేరుతున్నాయా అంటే కాదనే చెప్పాలి. కొంతమంది ధనవంతులు కూడా పిల్లల పేరున ఆస్తులు మార్పించేసుకుని పింఛన్లు తీసుకుంటున్నారు. ఆ మధ్య కొన్నాళ్లు చనిపోయినవారి పేరున కూడా పింఛన్లు మంజూరయ్యేవి. వేలిముద్రలు సమస్యగా ఉందంటూ సచివాలయ సిబ్బంది వేలిముద్రల ద్వారా అవి పంపిణీ చేసేవారు. అయితే ఈకేవైసీ పేరిట అలాంటి ఆత్మల పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం శాశ్వతంగా చరమగీతం పాడేసింది.

ఇక ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ఈ రాష్ట్రంలో పింఛన్ తీసుకునేవారి ఏరివేత మొదలు పెట్టామని చెబుతోంది ప్రభుత్వం. వీరంతా 2-3 నెలలకోసారి వచ్చి ఏకమొత్తంగా ఒకేసారి 3 నెలల పింఛన్లు తీసుకుని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారనేది అధికారుల వాదన.

ఇలా లెక్కలు తీస్తే… మే లో 2.57 లక్షలమంది, జూన్ లో 2.70లక్షలు,  జులై లో 2.14లక్షలు, ఆగస్ట్ లో 2.40 లక్షలమంది పింఛన్లు తీసుకోలేదని తేలింది. మూడు నెలల బకాయిలు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఉండటంతో.. వారంతా సరిగ్గా మూడు నెలలకోసారి సొంత ఊళ్లకు వచ్చి పింఛన్లు తీసుకెళ్తున్నట్టు నిర్థారించుకున్నారు. దీంతో కొత్త విధానాన్ని ఈ రోజు నుంచే అమలులో పెట్టారు. 

ఏ నెలకానెల పింఛన్ తీసుకోకపోతే, తరువాతి నెలకు అది బదిలీ కాదు. అంటే ఒకేసారి రెండు మూడు నెలల పింఛన్ తీసుకోవడం కుదరదు. అంటే అక్రమాలకు చెక్ పడినట్టే భావించాలి.

పేదవాడి పింఛన్ పై వేటు

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. పేదల పింఛన్ పై ప్రభుత్వం వేటు వేస్తోందని, అర్హులకు అన్యాయం చేస్తోందనేది ప్రతిపక్షాల వాదన. గతేడాది లాక్ డౌన్ సమయంలో 1.86 లక్షల మందికి ఆరు నెలల పింఛన్ ను ఒకేసారి అందించారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడకపోవడంతో.. చాలామంది వలసలు వెళ్లి బతుకుతున్నారని, అలాంటి వారంతా ఇప్పుడు పింఛన్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం లబ్ధిదారులను తగ్గించడం కోసమే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ వేసిందని, ఇందుకేనా జగన్ పింఛన్లను పెంచుకుంటూ పోతానని చెప్పింది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఒకేసారి 2 లక్షలమందికి పైగా లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల నుంచి పింఛన్ తీసుకోకుండా ఈరోజు మొత్తం మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకుందామని వేచి చూసినవారంతా తాజా కండిషన్ తో షాకయ్యారు. 

ఏ నెలకు ఆ నెల పింఛన్ ఇస్తాం, అదీ 3 రోజుల పాటు, ఇంటి వద్ద అందుబాటులో ఉన్నవారికే ఇస్తామంటూ నిబంధనలు విధించడం సరికాదనేది సామాన్యుడి వాదన. మరి లబ్ధిదారుల బాధల్ని ప్రభుత్వం గుర్తిస్తుందా.. లేదా అధికారుల లాజిక్ నే సమర్థిస్తుందా అనేది చూడాలి.