ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించేందుకు టీడీపీ యువనేత నారా లోకేశ్ ముందుంటారు. కారణం లేకుండా కూడా జగన్‌ను టార్గెట్ చేయడం లోకేశ్ ప్రత్యేకత. అలాంటిది ఏదైనా అంశం దొరికితే ఇక చెప్పేదేముంది.
ఇంత కాలం సోషల్ మీడియా వేదికగా జగన్‌పై నిప్పులు చెరిగిన లోకేశ్… తాజాగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ విమర్శలు చేయడం విశేషం. తాజాగా పోలవరం నిర్వాసితుల సమస్య లోకేశ్‌కు చిక్కింది.
పోలవరం నిర్వాసితులకు భయపడి తాడేపల్లిలోని తన ఇంట్లో సీఎం జగన్ దాక్కుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం పెదవేంపల్లిలో నారా లోకేశ్ బుధవారం పర్యటించారు. అక్కడ పోలవరం పునరావాస కాలనీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాళ్ల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవంటూ వాళ్లు వాపోయారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గతంలో పోలవరానికి నిధులు రాకుండా కేంద్రానికి జగన్ లేఖలు రాశారని విమర్శించారు. నేడు అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రాన్ని నిధులు అడగలేని పరిస్థితి ఉందన్నారు. త్వరలో అందర్నీ కలుపుకుని పోలవరం నిర్వాసితుల కోసం ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికైనా జగన్ ప్రజల్లోకి రావడంపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తే… లోకేశ్‌కు భవిష్యత్ వుంటుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.