ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు అయ్యింది. ఇక కాంగ్రెస్ అయితే అభ్యర్థిని వెతుకూతూ ఉందట! అభ్యర్థి ఖరారు కాగానే.. నామినేషన్ వేసేస్తారట! పరువు పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా వెదుకుతోందనమాట!
ఇక బీజేపీ నేతలు అయితే.. ఆత్మకూరు విషయంలో అన్నీ తెలిసే తమ పార్టీ తరఫున నామినేషన్ వేయించినట్టుగా చెప్పుకుంటున్నారు! ఇప్పటికే ఏపీలో ఉప ఎన్నికల్లో వరసగా పోటీ చేసి బీజేపీ భంగపాటును ఎదుర్కొంది. ఏదో అధికార పక్షం మీద సానుభూతితో ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ మెజారిటీలు దక్కడం కాదు, అసలు బీజేపీ ఏం ఉద్ధరించి ఓట్లు అడుగుతోందన్నట్టుగానే ఆ పార్టీ పట్ల స్పందన వ్యక్తం అయ్యింది ప్రజల నుంచి!
అయినా కూడా ఇలా ఛీత్కారాలు పొందడం తమకు కొత్త కాదన్నట్టుగా ఆత్మకూరు లో కూడా బీజేపీ పోటీకి దిగింది. కేంద్రంలో అధికారం దక్కి ఎనిమిదేళ్లు అవుతోంది. ఏపీ విభజనకు మద్దతు తెలిపిన పార్టీగా.. సీమాంధ్ర సహిత ఏపీకి తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాస్తైన బాధ్యత చూపలేదు కమలం పార్టీ! ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాలం వెల్లదీస్తోంది.
ఇంతోటి దానికి వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ కమలం పార్టీ నేతలు కామెడీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటలను కేఏ పాల్ కూడా మాట్లాడుతున్నారు, మరి కాస్త తేడా చూపడానికి అయినా.. ఇలాంటి ఉప ఎన్నికల్లో పెద్ద మనిషి తరహాలో తప్పుకుని ఉంటే బీజేపీకే చెప్పుకోవడానికి కొద్దో గొప్పో ఉండేది. ఇలా బరిలోకి దిగి మరింత పరువు పోగొట్టుకోవడానికే బీజేపీ కంకణం కట్టుకోవడం గమనార్హం.