వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ చెప్పుకోవడం ద్వారా రాజకీయంలో తన గుగ్గురువు చంద్రబాబు నాయుడుకు తను తగిన వాడినే అంటూ సందేశం ఇచ్చుకున్నట్టైంది జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకూ ఏపీ రాజకీయంలో చూస్తే.. అత్యధిక పార్టీలతో పొత్తులు, కత్తులు సంధించడంలో చంద్రబాబుదే ఆల్ టైమ్ రికార్డు!
టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్.. ఇలా ఒక్కో పర్యాయం ఒక్కోరితో జట్టు కట్టిన చరిత్ర చంద్రబాబుకే సొంతం. చంద్రబాబు రికార్డును ఇప్పటికే సగం వరకూ తిరగరాశారు పవన్ కల్యాణ్. చంద్రబాబు అయినా ఆ పొత్తులను నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకున్నారు. పవన్ కు ఆ జ్ఞానం ఎలాగూ లేదు. ఏదో చంద్రబాబు చెప్పినట్టుగా ఇన్నాళ్లూ చేస్తూ వచ్చారంతే!
దీంతో.. ఇప్పటికే ఎర్ర జెండాలతోనూ, కాషాయ జెండాలతోనూ, నీలిజెండా బీఎస్పీతోనూ పవన్ పొత్తుల కాపురాలు, విడాకులు అయ్యాయి. కాషాయ జెండాతో అయితే ఒకసారి స్నేహం అయ్యింది, మరోసారి శత్రుత్వం అయ్యింది, ఇప్పుడు ఇంకోసారి స్నేహం సాగుతూ ఉంది!
మరి అటు కాషాయ పార్టీతో కాపురం చేస్తూనే… మరోవైపు ఆ పార్టీని కూడా పచ్చ పార్టీతో కాపురానికి పిలుస్తున్నారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయడం తనకు ఒక ఛాయిస్ అయితే, బీజేపీతోనే కలిసి పోటీ చేయడం రెండో ఛాయిస్ అట. సొంతంగా పోటీ చేయడం మాత్రం చివరి ఛాయిస్!
ఇప్పటి వరకూ సొంతంగా పోటీ చేయడాన్ని చివరి ఛాయిస్ గా పరిగణించింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే! తమకు బలం ఉన్నా లేకపోయినా.. ఏపీలో ఆఖరికి కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ లు కూడా సొంతంగా పోటీకి సై అంటాయి. అయితే చంద్రబాబుకు మాత్రమే అది చేత కాదు. అలాంటి చేతగాని తనం విషయంలో తను కూడా చంద్రబాబుకు ధీటైన వాడినే అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నారు. సోలోగా సత్తా చాటేంత సీన్ లేక.. సోలోగా పోరాడే ఓపిక లేక.. ఎంతసేపూ పొత్తులు, సీట్లు, చీలే ఓట్లు అనుకుంటూ గాలి మేడలు కట్టుకుంటూ ఉన్నాడు పీకే!