సాధారణంగా మనం ఎవరైనా బాగా మాటలు చెప్పేవాడిని చూస్తే వీడు నోరు పెట్టుకొని బతుకుతున్నాడురా అంటుంటాం. ఇలా నోరు పెట్టుకొని బతికేవారిలో ముందు వరుసలో ఉండేవారు రాజకీయ నాయకులు. వాళ్లకు అంగబలం, అర్ధబలం ఉన్నా ప్రధాన బలం, ఆయుధం నోరే. ఉదాహరణకు కేసీఆర్, కేటీఆర్ ప్రజలను ఆకర్షించేది నోటి మాటల ద్వారానే. అంటే చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారన్న మాట. మాటలెన్ని చెప్పినా చేతలు కూడా ఉన్నప్పుడే ప్రయోజనం.
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే …. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలంగా మాటలు బాగా నేర్చాడు. మాటలతో కోటలు కడుతున్నాడు. ఆయన చెప్పేది కంఠశోష తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పార్టీ నుంచిగానీ, కేంద్రం నుంచిగానీ చేతలు ఎలాగూ లేవు. కాబట్టి నాలుగు మాటలు చెబితే ప్రజలు బుట్టలో పడతారని అనుకుంటున్నాడు. దీంతో పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. సోము వీర్రాజువల్ల ఏపీ బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదని అధిష్టానం ఎప్పుడో గ్రహించింది. అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారని గతంలో బాగానే ప్రచారం జరిగింది. కానీ ఎందుకో మళ్ళీ కొనసాగిస్తున్నారు.
ఉన్న ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందోనని మాటల కోటలు కడుతున్నాడు. సోము వీర్రాజు ప్రధానంగా చెబుతున్నదేమిటి? వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని. ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట అనే సామెత సోముకు బాగా వర్తిస్తుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయలేకపోయాడుగానీ ఏకంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నాడు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతున్నారు. అయితే వాళ్ళు చెబుతున్న దాంట్లో అంతో ఇంతో లాజిక్ ఉంది. అక్కడ బీజేపీకి కొన్ని విజయాలైనా ఉన్నాయి. బలమైన నాయకులున్నారు. చేరికలున్నాయి. యాక్టివిటీస్ ఉన్నాయి. కేంద్ర నాయకులను రప్పించి యేవో కార్యక్రమాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది. కానీ ఏపీలో ఇలాంటిది ఏమీ లేదు. మరి ఏ విధంగా అధికారంలోకి వస్తారు.
కానీ సోము వీర్రాజు మాటలు కోటలు దాటిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మూడేళ్ళల్లో అమరావతి రాజధానిని నిర్మించేస్తామన్నారు. మొదటి సంతకం రాజధాని నిర్మాణంపైనే పెడతారట. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేవలం అమరావతి నిర్మాణానికి మాత్రమే రు. 10 వేల కోట్లు తెప్పిస్తామన్నారు. తాజాగా వీర్రాజు మాటలు చూసిన తర్వాత మాటలు కోటలు దాటుతున్నాయనే సామెత గుర్తురాకమానదు. బీజేపీ అధికారంలోకి వచ్చేదెపుడు? అమరావతి రాజధానిని నిర్మించేదెపుడు? రాజధాని నిర్మాణాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఎన్నికల్లో పోటీచేయటానికి 175 నియోజకవర్గాల్లోను బీజేపీకి అభ్యర్ధులున్నారన్నా అన్నదే అసలైన పాయింట్. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయటానికే పార్టీకి అభ్యర్ధి దొరకటంలేదు.
ఆత్మకూరులో ఉపఎన్నిక జరుగుతుందని అందరికీ ఎప్పుడో తెలుసు. అయినా ఇప్పటివరకు ఇక్కడినుండి పోటీ చేయటానికి ఒక అభ్యర్ధిని రెడీ చేసుకోలేకపోయారు. ఆత్మకూరులో పోటీచేయటానికి సీనియర్లు ఎవరు ముందుకు రావటంలేదు. బిజివేముల రవీంద్రనాద్ అనే కొత్త నేత ముందుకొచ్చినా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే సీనియర్లు ముందుకు రావటంలేదు, కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరిస్ధితి ఇక్కడ విచిత్రంగా ఉంది. ఒక్క నియోజకవర్గంలో అభ్యర్ధిని రెడీ చేసుకోలేకపోయిన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే జనాలు నమ్ముతారా ?
ఏదో వీర్రాజు కాస్త కామెడీ చేస్తున్నారని అందరు కాసేపు నవ్వుకుని ఆ మాటలను మరచిపోతారంతే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 3 శాతం అంటేనే ఏపీలో పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో అయినా ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశంలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ఏపీకి చేసిన మేలు ఏమీ లేకపోగా ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది మాత్రం జనాలకు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనలో పొత్తు ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా రెండు పార్టీలు కలిసి ఊడబొడిచేది ఏమీ లేదు.