వచ్చే నెల 7, 8 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. నాగార్జున విశ్వవిద్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసే వేదికపై రెండురోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ప్లీనరీని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల మహానాడు సూపర్ సక్సెస్ అయ్యిందని టీడీపీ ఉత్సాహంగా ఉంది. దీంతో మహానాడును తలదన్నేలా వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో తమకు ఏ మాత్రం జనాదరణ తగ్గలేదనే సంకేతాల్ని పంపేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది. ప్లీనరీని విజయ వంతం చేసేందుకు పార్టీ పెద్దలు సమాలోచనలు జరిపినట్టు సమాచారం.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 వేల మంది జనసమీకరణ చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఈ లెక్కన 3.50 లక్షల మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిసింది.
బూత్‌లెవెల్ కమిటీలను కూడా బలోపేతం చేసేందుకు తక్షణం చర్యలు చేపట్టాలనే ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వంపై అధికార పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో, ఈ ప్లీనరీ సమావేశాలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
టీడీపీ మహానాడుకు మించి సక్సెస్ చేయడంపైనే పార్టీ పెద్దలు దృష్టి సారించారు. సమావేశాలను ఘనంగా నిర్వహించడానికి అధికార పార్టీకి పుష్కలంగా వనరులున్నాయి. చేయాల్సిన పని కేవలం అందర్నీ సమన్వయపరచుకోవడమే.