ఇండియాలో కరోనావ్యాప్తి గురించిన గణాంకాలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి నిమిషానికీ 10 మంది కొత్తగా కరోనా బారిన పడుతున్నారు. నిమిషానికి పదిమంది, గంటకు ఆరు వందల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. స్థూలంగా ప్రస్తుతం రోజుకు 15 వేల మంది వరకూ కరోనా వైరస్ బారిన పడుతున్నారని ప్రభుత్వాల గణాంకాలు చెబుతున్నాయి. అయితే పెరుగుదల రేటు కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది.
మొదటి నుంచి ఈ కేసులు పెరుగుతున్న చోటే.. ఇప్పుడు కూడా కొత్త కేసులు ఎక్కువ స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. ఎటొచ్చీ రోజు రోజుకూ పెరుగుదల రేటు కూడా పెరుగుతూ ఉండటమే ఆందోళనకరమైన అంశంగా మారింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ.. కరోనా వైరస్ విషయంలో దేశం మొత్తం మీది 50 శాతానికి మించి కేసులు నమోదైన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో అదే నిష్పత్తిలో కొత్త కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి.
మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది అనే ఆందోళనలూ వ్యక్తం అవుతున్నాయి. కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో మొదటి నుంచి ఆసక్తి చూపని తెలంగాణలో కొందరు ప్రజాప్రతినిధులకే కరోనా వైరస్ సోకడం వార్తల్లోని అంశంగా నిలుస్తూ ఉంది. కరోనా పరీక్షల విషయంలో ఎవరేం చెప్పినా ఎదురుదాడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎలాంటి సింప్టమ్స్ లేని వాళ్లకు పరీక్షలు చేసినా అక్కడ భారీ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక మరోవైపు కరోనా నివారణకు కొత్త మందు అందుబాటులో వచ్చినట్టుగానూ వార్తలు వస్తున్నాయి. స్వల్ప స్థాయి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు నివారణగా పనికిరాగలదని అంచనా వేస్తున్నారు. అయితే దీని ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. దేశంలో ఇప్పటి వరకూ కరోనా రికవరీ రేటు 54 శాతానికి చేరడం ఊరటను ఇచ్చే అంశం. మొత్తం కేసుల సంఖ్య దాదాపు నాలుగు లక్షల వరకూ ఉండగా, యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా అరవై ఎనిమిది వేల వరకూ ఉందని ప్రభుత్వాల గణాంకాలు చెబుతున్నాయి.