తొమ్మిదేళ్ల క్రితం కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉండేవారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. తదుపరి రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ చిత్రంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీబీఐ విచారణ వచ్చింది. అది కూడా ఆయన ఎంపీగా కాని, ఎమ్మెల్యేగా గాని లేనప్పుడు ఆయన చేపట్టిన వ్యాపారాలు, పెట్టుబడులపైన. దేశంలో అలాంటి కేసు బహుశా మరొకటి ఉండకపోవచ్చు.
ప్రభుత్వంలో లేని వ్యక్తిపై అవినీతి కేసు ఏమిటి? పెట్టుబడుల కేసు ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి కొత్తగా ఒక పేరు కనిపెట్టారు. క్విడ్ ప్రోకో అని. ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు ఒక లేఖ అది కూడా సంతకం కూడా సరిగా చేయని లేఖ ఆధారంగా హైకోర్టు విచారణకు ఆదేశించింది. దానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా భాగస్వామి అయింది.
అవినీతిపై పోరాటంలో భాగంగా చేస్తున్నానని చంద్రబాబు చెప్పేవారు. జగన్‌పై కక్ష, పగతో కాదని అనేవారు. ఇక ఆయనకు మద్దతు ఇచ్చే తెలుగుదేశం పత్రికలుగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కొన్ని మీడియా సంస్థలు అయితే రెచ్చిపోయి, పుంఖానుపుంఖాలుగా పరిశోధనాత్మక కథనాల పేరుతో ఉన్నవీ, లేనివి రాసేవి.
సీబీఐ ఎవరిని ఈ కేసులలో విచారించినా, అదేమిటో మొత్తం తెల్లవారేసరికల్లా ఈ పత్రికలలో, టీవీలలో కథనాలుగా వచ్చేసేవి. సీబీఐ లక్ష్మీనారాయణ అవినీతిపై పోరాడే యోధుడి మాదిరి వీరంతా చిత్రీకరించేవారు. నిజానికి అప్పుడు జరిగింది అవినీతిపై పోరాటం కాదు.. పెట్టుబడులపై పోరాటం. దానివల్ల ఏపీకి అపారమైన నష్టం జరిగింది.
రాజకీయ కక్షతో సాగిన ఈ విచారణ వల్ల ఉమ్మడి ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష తెలుగుదేశం, వారికి తోడు సీబీఐ లక్ష్మీనారాయణ కల్పించారన్నది ఎక్కువ మంది భావన. పోనీ జగన్‌పై చేసినట్లు అప్పటికే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల గురించి విచారణ చేయండి అని అడిగితే కోర్టులు సీరియస్‌గా స్పందించలేదు. సీబీఐ ఆసక్తి కనబరచలేదు. దీంతో ప్రజలందరినికి ఒక అభిప్రాయం ఏర్పడింది.
ఇదంతా జగన్ శక్తిమంతమైన నేతగా ఎదురుగుతున్నందున కాంగ్రెస్, టీడీపీలు, సోనియాగాంధీ, చంద్రబాబులు ఏకమై కక్షపూరిత కేసులు పెట్టారని ప్రజలు నమ్మారు. అప్పట్లో ఈ కేసులో అరెస్టు అయిన మోపిదేవి వెంకటరమణ బీసీవర్గం నేత, అలాగే మరో బీసీనేత ధర్మాన ప్రసాదరావుపై కూడా కేసు పెట్టారు. కొందరు అధికారులు కూడా ఈ కేసుల కారణంగా ఇబ్బందిపడి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు ఆ కేసులలో కొందరు విముక్తి పొందారు. మరికొందరు విచారణను ఎదుర్కుంటున్నారు. ఈ విషయాన్ని అంతా ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందంటే ఏ అధికారం లేని సమయంలో జగన్‌పై అనేక కేసులు రావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ నేతలపై ఎవరిమీద కేసు వచ్చినా అక్రమమని, కక్షసాధింపు అని, లేదా బీసీ అని పెట్టారని అంటున్నారు.
రాజకీయాలలో ద్వంద్వ వైఖరులతో ఎప్పటికప్పుడు నాలుక మడతవేసి మాట్లాడడంలో చంద్రబాబు దిట్టగా పేరొందారు. సరిగ్గా ఆయన దోరణిలోనే కొన్ని పత్రికలు ఇప్పుడు వ్యవహరిస్తున్నాయి. అవినీతి ఎక్కడ ఉన్నా అంకుశంతో పొడవాలని పెద్ద, పెద్ద సంపాదకీయాలు రాసిన ఈనాడు కాని, అక్షరమే ఆయుధం అని ప్రచారం చేసుకున్న జ్యోతి కాని ఇప్పుడు ఆ అంకుశాలు తెలుగుదేశం నేతల మీద తప్ప ఎవరిపైన అయినా పెట్టుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను విచారించడం ఆరంభించింది. ఎన్నికల ముందే జగన్ తాను ఎలా ఈ స్కామ్‌లపై విచారణ చేస్తానో చెప్పారు. సరిగ్గా అదే రీతిలో ముందుగా మంత్రుల కమిటీతో స్టడీ చేయించారు. అవినీతికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేదా అన్నది పరిశీలించారు.
ఆ తర్వాత ఒకటికి రెండు దర్యాప్తు సంస్థలకు అప్పగించి విచారణ చేయించారు. తదుపరి అరెస్టుల పర్వం ఆరంభం అయింది. ఈఎస్‌ఐ సంస్థ కార్మికుల ఆరోగ్యాల కోసం ఏర్పాటైంది. ఉద్యోగుల జీతాల నుంచి కూడా కొంత కట్ చేస్తారు. ఆ డబ్బుతో వారికి వైద్య సేవలు అందిస్తారు. అలాంటి సంస్థలో ఇష్టారీతిన మందుల కొనుగోళ్లలో, ఇతరత్రా వందలకోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ అభియోగాలు మోపితే చంద్రబాబు నాయుడు అది అక్రమ కేసు అని అంటున్నారు.
అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా ఫలానా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వండి అని లేఖ రాస్తే ఆయనను అరెస్టు చేయడం తప్పు అని, బీసీ కనుక అరెస్టు చేశారని ప్రచారం మొదలు పెట్టారు. అధికారులను అరెస్టు చేయవచ్చు కాని మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అంటే జగన్ కేసులో కనీసం ఎమ్మెల్యే కాకపోయినా, అధికారంలో ఎన్నడూ లేకపోయినా, ఆయనను జైలులో పెట్టాలని, అసలు ఎన్నటికీ బెయిల్ ఇవ్వకూడదని వాదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ప్రభుత్వంలో జరిగిన అవినీతికి మాత్రం కులం రంగు, కక్షల రంగు ఎలా పులుముతున్నాడో చూడండి. వారికి కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ఎలా వంత పాడుతున్నాయో గమనించండి.
నిజానికి ఈ మీడియా ఏమి చేసి ఉండాల్సింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏమి జరిగింది? ఎంత నష్టం జరిగింది? తదితర అంశాలను స్వయంగా పరిశోధించి రాసి ఉండవలసింది. తెలంగాణలో ఇలాంటి స్కామ్ బయటపడగానే ఏపీలో ఎలా జరిగిందా అన్నది అన్వేషించి ఉండాల్సింది. అలా చేయకపోగా టీడీపీ నేతల ఆరోపణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రచారం చేస్తూ అవినీతికి ఎంతగా మద్దతు ఇస్తున్నారో చూస్తే విస్మయం కలుగుతుంది.
మీడియా పరిస్థితి ఇంత దయనీయంగా మారుతుందని గతంలో ఊహించలేదు. ఇక జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిల అరెస్టులు కూడా అక్రమమేనని చంద్రబాబు వాదన. స్వయంగా లోకేష్ పరామర్శల పర్యటన. జేసీ సోదరులకు ఎప్పటి నుంచో ట్రావెల్స్ వ్యాపారాలు ఉన్నాయని సమర్థన. గతంలో టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసింది, ఈనాడు వంటి పత్రికలు ఇదే జేసీ దివాకరరెడ్డి కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంస్థలపై, అవినీతిపై ఎన్ని కథనాలు రాసింది లోకేష్‌కు తెలిసి ఉండవకపోవచ్చు. కాని చంద్రబాబుకు తెలియదా? జేసీ దివాకరరెడ్డి సైతం వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు జరగలేదని చెప్పలేకపోయారు. కాకపోతే ముందుగా ఫలానావారిని అరెస్టు చేయకుండా మావాళ్లను ఎలా అరెస్టు చేశారని అంటున్నారు. ఈ కేసులో బయటకు వచ్చిన విషయాలు విస్మయం కలిగిస్తాయి.
నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ భీమా ఇలా ఏది కావాలంటే దానిని సొంతంగా స్టాంపులు తయారు చేసుకున్నారన్న వార్తలు అందరికి దిగ్భ్రాంతి కలిగిస్తాయి. నిజానికి జేసీ దివాకరరెడ్డి తన కుటుంబ వ్యాపారాలలో ఇలాంటివి జరగకుండా చూసుకోగలిగి ఉంటే బాగుండేది. కాని ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏమి ఉంటుంది? వీటిని చంద్రబాబు వంటివారు సమర్ధించడం అంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న అవసరం తప్ప మరొకటి కాదు. మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు దమ్ముంటే మావాళ్లపై కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి అని సవాళ్లు చేశారు.
తీరా అవినీతి కేసుల్లో అరెస్టులు జరిగాక, అమ్మో అది అక్రమం అంటూ యాగీ చేస్తున్నారు. ఈ కేసుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వీరు ఎవరూ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అభియోగాల మీద తప్ప రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. మరో వైపు జేసీ దివాకరరెడ్డి వంటివారు చంద్రబాబుతో గొడవ ఉంటే ఆయనపై వెళ్లాలికాని, ఆయన చుట్టూ ఉన్న మాబోటి వాళ్ల జోలికి ఎందుకు అని అంటున్నారు. చంద్రబాబు జోలికి వెళితే భస్మమేనని ఆయన చెబుతున్నారు. భవిష్యత్తులో రాజధాని భూములతో సహా ఫైబర్ గ్రిడ్ కేసు, చంద్రన్న కానుకల్లో అవినీతి తదితర కేసులను సీబీఐ చేపడితే అప్పుడు పరిస్థితి ఇంకా సీరియస్ అవుతుంది.
కాంగ్రెస్ అవినీతిని అణచివేయడానికి టీడీపీ పార్టీ పెట్టానని ఎన్‌టీరామారావు ప్రచారం చేసేవారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ నుంచే వచ్చిన చంద్రబాబుకు ఆ పార్టీ హస్తగతమైంది. ఇప్పుడు అనేక అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురుదాడి చేస్తున్నారు. కాని నాలుగేళ్లపాటు ఎదురుదాడి చేయడం కష్టం. దానికన్నా ముందుగా వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ఈ ప్రక్షాళన దేశచరిత్రలో ఒక రికార్డు సష్టించి, అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా నిలబడగలిగితే అది చాలా గొప్ప విషయం అవుతుంది. కాని అది అంత తేలికైన విషయం కాదని చెప్పక తప్పదు.