ఎట్టకేలకూ కమల్ హాసన్ కు దశాబ్దం తర్వాత చెప్పుకోదగిన కమర్షియల్ హిట్ దక్కినట్టుగానే ఉంది. విక్రమ్ సినిమాకు వీకెండ్ లో టికెట్ దొరకడమే కష్టంగా మారింది! ముందస్తు బుకింగ్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రద్దీ కనిపిస్తూ ఉంది. తెలుగు వెర్షన్ విషయంలోనే ఈ డిమాండ్ ఉండటం గమనార్హం. పాజిటివ్ బజ్, కమల్ తో పాటు ఫాజిల్, విజయ్ సేతుపతి ఎక్స్ ట్రా అట్రాక్షన్లుగా నిలవడం విక్రమ్ కు పెద్ద ప్లస్ అయ్యింది. గత దశాబ్దకాలంలో కమల్ నుంచి వచ్చిన సినిమాలు కూడా తక్కువే.
పుష్కరకాలం నుంచి గమనించినా.. మన్మథన్ అన్బు, ఫర్వాలేదు. ఫ్యాన్స్ వరకూ నచ్చుతుంది. ఆ తర్వాత వచ్చిన విశ్వరూపం కూడా ఆకట్టుకుంది, కమర్షియల్ గా హిట్. సీన్లు సీన్లుగా చూస్తే ఉత్తమ విలన్ బాగానే ఉంటుంది కానీ, మొత్తంగా చూస్తే మాత్రం సో..సో.. నే. ఇక దృశ్యం తమిళ రీమేక్ తమిళనాడు వరకే పరిమితం.
చీకటి రాజ్యం పాజిటివ్ రేటింగులనే పొందినా జనాలను థియేటర్లకు క్యూ కట్టించలేకపోయింది. విశ్వరూపం పార్ట్ టూ డిజాస్టర్ అయ్యింది. భారతీయుడు పార్ట్ టూకు శ్రీకారం చుట్టిన కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తారో లేదో అనేది శేషప్రశ్న. ఇలాంటి తరుణంలో .. సుదీర్ఘ సమయం మేకింగ్ తోనే విడుదల అయిన విక్రమ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా బుకింగ్ సైట్లను ఓపెన్ చేసేలా చేస్తోంది. ఫ్యాన్స్ నుంచినే కాక సగటు ప్రేక్షకుడి నుంచి కూడా కమల్ తాజా సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా కమల్ సినిమాకు తెలుగునాట కలెక్షన్ల అవకాశాన్ని ఇస్తున్నట్టుంది.