జగన్ కు గుడి కట్టేశాడు …భారతమ్మ భజన చేస్తున్నాడు

ప్రతీ రాజకీయ పార్టీలో జాతీయ పార్టీ కావొచ్చు, ప్రాంతీయ పార్టీ కావొచ్చు స్వామి భక్తులు ఉంటారు. భజనపరులు ఉంటారు. పూర్వ కాలంలో వీరశైవులు, వీర వైష్ణవులు ఉండేవారు. సిద్ధాంతాలపరంగా రాజకీయపార్టీల్లో ఇదివరకు అతివాదులు, మితవాదులు…

ప్రతీ రాజకీయ పార్టీలో జాతీయ పార్టీ కావొచ్చు, ప్రాంతీయ పార్టీ కావొచ్చు స్వామి భక్తులు ఉంటారు. భజనపరులు ఉంటారు. పూర్వ కాలంలో వీరశైవులు, వీర వైష్ణవులు ఉండేవారు. సిద్ధాంతాలపరంగా రాజకీయపార్టీల్లో ఇదివరకు అతివాదులు, మితవాదులు ఉండేవారు. ఇప్పుడు ఏ పార్టీలోనూ సిద్ధాంతాలు లేవు కాబట్టి అతివాదులు లేరు. మితవాదులు లేరు. ఉన్నదల్లా భక్తులు, భజనపరులు మాత్రమే.

వీరిలో కొందరు స్తోత్రాలు చదువుతారు. కొందరు కీర్తనలు పాడతారు. అధినాయకుడిని లేదా అధినాయకురాలిని ప్రతిపక్షాలు విమర్శిస్తే ఈ భక్తులు రెచ్చిపోతారు. తమలపాకుతో ప్రతిపక్షీయులు ఒక్కటంటే, వీరు తలుపుచెక్కతో రెండంటారు. సరే… ఈ రోజుల్లో బూతులు తిట్టడం సర్వసాధారణమై పోయిందనుకోండి. ఇక కొందరు స్వామి భక్తులు మాటల్లోనే కాదు, చేతల్లోనూ వారి భక్తి ప్రపత్తులు చూపిస్తుంటారు. భక్తి ముదిరి పాకాన పడితే వారు చేతల్లో ఏం చేస్తారో చెప్పలేం.

సినిమా వీరాభిమానులు కొందరు తారలకు (ఆడలేడీస్ కు) గుడులు కట్టడం తెలిసిందే కదా. అదే టైపులో రాజకీయ నాయకులకూ గుడులు కట్టిన వైనాలూ ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే… వైసీపీ ఎమ్మెల్యే ఒకాయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గుడి కట్టాడు. ఆయనది అంతటి వీరాభిమానం మరి. ఈ గొప్ప పని చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జగన్ జైలుకు పోతాడా? పదవిలో కొనసాగుతాడా ? అనే చర్చ జరుగుతోంది కదా. ఒకవేళ జగన్ జైలుకు వెళితే ఆయన భార్య సీఎం అవుతుందని అంచనా.

భర్త జైలుకు వెళ్లడం, భార్య సీఎం కావడం జరుగుతుందో లేదో ఎవ్వరూ చెప్పలేరు. కానీ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెతలా ఉంది పరిస్థితి. ఎందుకైనా మంచిదని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భారతి భజన చేస్తున్నారట. నిజానికి జగన్ సతీమణిగా వైఎస్ భారతి జనాలకు పరిచయం. జగన్ కూడా తన కుటుంబం గురించి ఎక్కడా బయట చెప్పుకోరు. 

కానీ ఈ మధ్య కాలంలో భారతమ్మ టీడీపీ అనుకూల మీడియా వార్తల ద్వారా ఫోకస్ లోకి వచ్చింది. ఒకవేళ ఏ కారణం చేతనైనా జగన్ జైలుకు వెళ్తే భారతమ్మే సీఎం అని టీడీపీ అనుకూల మీడియా వార్తలు వార్చి వడ్డిస్తోంది. బహుశా ఈ వార్తల ప్రభావమో లేక ముందు చూపో తెలియదు కానీ వైసీపీ నేతలు మాత్రం వైఎస్ భారతిని కీర్తించడం అలవాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అందరి కంటే ఒకడుగు ముందుకు వేసి తన ఏరియాలో జగన్, భారతమ్మల భారీ ఎత్తున కటౌట్ పెట్టి మరీ ఈ మధ్య బాగానే సందడి చేశాడు.  

జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఫస్ట్ టైమ్ వైఎస్ భారతి తో కలసి అలా కటౌట్ మీద కనిపించారు. ఫ్లెక్సీల మీద మెరిశారు. ఇక ఆయన బాటలో చాలా చోట్ల జగన్ వైఎస్ భారతి కి పెళ్ళి రోజుల శుభాకాంక్షలు చెబుతూ కీలక నేతలే హడావుడి చేశారు. మరోవైపు కొందరు ముఖ్య నేతలు మీడియా సమావేశాలలో వైఎస్ భారతిని పొగుడుతున్నారు.  

వైఎస్ భారతి లేకపోతే జగన్ రాజకీయ జీవితంలో ఇన్ని విజయాలు దక్కేవి కావని చెబుతున్నారు. జగన్ కాంగ్రెస్ ని ఎదిరించి జైలు పాలు అయిన వేళ భారతి చూపిన ధైర్యం ఒక వైపు సొంత మీడియా సంస్థను, మరో వైపు వ్యాపారాలను చూసుకుంటూ ఇంకో వైపు చిన్న పిల్లలను సాకుతూ భర్త ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చిందని పలువురు వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

జగన్ వీర భక్తుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ ఆలయం నిర్మించాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల మేర నిధులు వెచ్చించి ఆలయ నిర్మాణం  చేశారని కొందరు చెబుతుంటే, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కొందరు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణాన్ని.. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలో చేపట్టారు.

ఈ ఆలయానికి పక్కనే దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసారు. ఆలయానికి ముందు భాగంలో నవరత్న పథకాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ. మద్యపాన నిషేధం., అమ్మఒడి., వైఎస్ ఆర్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ పెంపు తదితర పథకాల స్థూపాలను ఏర్పాటు చేసారు. నవరత్నాల సృష్టికర్త జగన్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. 

తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా తనకు జగనే ముఖ్యమన్నాడు బియ్యపు మధుసూదన రెడ్డి. రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్‌కు తాను అలాగే అన్నాడు. మొదటిసారి ఓడిపోయినా తనకు మళ్ళీ టికెట్ ఇచ్చి జగనన్న గెలిపించారని.. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికే ఈ నవరత్నాల ఆలయం నిర్మించానని చెప్పాడు.