జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించేందుకు ఏ అంశం దొరికితే దాన్ని రఘురామ కృష్ణంరాజు హైలెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం, చంద్రబాబు అనుకూల మీడియా దాన్ని హైలెట్ చేయడం డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశాన్ని కూడా రఘురామ వదల్లేదు. సీఎం జగన్ చడ్డీలు వేసుకున్న నాటి టిక్కెట్ రేట్లను, ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. దీన్ని సినీ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.
రఘురామ కృష్ణంరాజుకు పరిశ్రమలోని పలువురితో పరిచయాలు ఉండవచ్చునని, అంతమాత్రాన సినీరంగంలోని సమస్యల మీద సంపూర్ణ అవగాహన లేకుండా, కేవలం విమర్శించాలన్న ఉద్దేశ్యంతో మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అన్నారు నట్టి కుమార్. జీవో 35కు విరుద్ధంగా టికెట్ల రేట్లు 200, 300 రూపాయలు ఉండాలంటూ రఘురామ సపోర్ట్ చేస్తున్నారని, ఇది ప్రేక్షకులకు ఎంత మాత్రం ఇష్టంలేదని అన్నారు నట్టికుమార్.
కొందరు సినీ ప్రముఖులు రఘురామ కృష్ణంరాజుతో తమకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారన్న నట్టికుమార్.. సదరు ఎంపీకి బహిరంగ సవాల్ విసిరారు. టిక్కెట్ రేట్లపై చర్చిద్దామని, ఓడిపోతే పాలాభిషేకం చేస్తానని అన్నారు.
“ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన నర్సాపురంలోనే బహిరంగంగా ప్రజల మధ్యన టిక్కెట్ల రేట్ల విషయంలో చర్చ పెడదాం. ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు నాతో కలిసి వస్తారా! నా ఛాలెంజ్ స్వీకరిస్తారా? రఘురామ కృష్ణంరాజు ప్రజాకోర్టులో ఓడిపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే ఆయనకు ప్రజా సమక్షంలో పాలాభిషేకం చేస్తాను”
చిన్న నిర్మాతల ప్రాతినిధ్యం లేకుండా చిరంజీవి ఓ బృందంతో వెళ్లి జగన్ ను కలవబోతున్నారని.. అది తనకు ఇష్టంలేదన్నారు నట్టికుమార్. చిరంజీవి బృందానికి పోటీగా.. తను కూడా చిన్న నిర్మాతలను వెంటబెట్టుకొని, జగన్ ను కలుస్తానని అన్నారు. జీవో-35 ఉపసంహరించకూడదని జగన్ ను కోరుతానంటున్నారు.