కార్య‌క‌ర్త‌లూ.. అటు వాళ్లు ఇటు, ఇటు వాళ్లు అటు!

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో నేత‌లే కాదు, కార్య‌క‌ర్త‌లూ కూడా అటూ ఇటూ గెంతుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయా పార్టీలే ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల‌కు కార‌ణ‌మైన ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌మితిని వీడి…

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో నేత‌లే కాదు, కార్య‌క‌ర్త‌లూ కూడా అటూ ఇటూ గెంతుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయా పార్టీలే ప్ర‌క‌టించుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల‌కు కార‌ణ‌మైన ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌మితిని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే కాంగ్రెస్ ఇన్ చార్జి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుకున్నారు. 

అంత‌లోనే బీజేపీ వైపు ఉండిన ఇ పెద్దిరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు ఇటూ ఇటూ మారారు. వారి వెంట క్యాడ‌ర్ కూడా అటూ ఇటూ గెంతి ఉండ‌వ‌చ్చు.

ఇక మ‌రోవైపు మా పార్టీలోకి వంద మంది ఆ పార్టీ నుంచి వ‌చ్చారు.. కాదు మా పార్టీలోకి ఆ పార్టీ వాళ్లే ఐదు వంద‌ల మంది వ‌చ్చారంటూ నేత‌లు ప్ర‌క‌టించుకోవ‌డం కూడా కొన‌సాగుతూ ఉంది. కొంద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు కాషాయ కండువాల‌ను ప‌క్క‌న ప‌డేసి హ‌రీష్ రావు ఆధ్వ‌ర్యంలో గులాబీ కండువాలు వేసుకున్నార‌ట‌.

అలాగే కొంద‌రు గులాబీ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా రాజేంద‌ర్ కు మ‌ద్ద‌తుగా బీజేపీ వైపు చేరార‌ట‌. వారిలో కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా ఉన్నార‌ని, టీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ వైపుకు వ‌చ్చార‌ని బీజేపీ చెప్పుకుంటోంది.

ఇలా నేత‌ల విష‌యంలోనే కాదు, కార్య‌క‌ర్త‌ల విష‌యంలో కూడా పార్టీలు ర‌క‌ర‌కాల  నంబ‌ర్ల‌ను, చేరిక‌లను చెబుతున్నాయి. ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. పార్టీ కండువా వేసుకుంటామంటే చాలు పెద్ద నేత‌ల ప‌ల‌క‌రింపులు, ప‌త్రిక‌ల్లో ఫొటోలు ప‌డేట్టుగా ఉన్నాయి!