వైసీపీ ప్రభ మసకబారుతోందని, ప్రజలంతా టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్న చంద్రబాబుకి 2024 ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, కనీసం ఎన్నికల ప్రచారంలో అయినా నవరత్నాలపై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది.
ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను కొనసాగిస్తారా లేక ఆపేస్తారా, లేక పేరుమార్చి కంటిన్యూ చేస్తారా అనే విషయంపై కచ్చితంగా నోరు తెరవాలి. అక్కడే ఆ పార్టీ అధినేతకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టవుతుంది.
నోరు పెగలదు, నవరత్నాలను ఆపేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం బాబుకి లేవు, అలాగని కొనసాగిస్తామంటే.. వాటికి బాబు పరోక్షంగా మద్దతిచ్చినట్టే లెక్క. ఇలా కుడితిలో పడ్డ ఎలుకలా అవుతోంది బాబు పరిస్థితి.
గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు..
నవరత్నాల పథకాలను గతంలో చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయా పథకాలు మొదలు పెట్టే రోజుల్లో పనిగట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు, మీడియా దృష్టిని మరల్చేందుకు తీవ్రంగా శ్రమించేవారు. కానీ ఆ పథకాలపై ఇప్పుడు బాబు మారు మాట్లాడటంలేదు. కనీసం విమర్శించడానికి కూడా సాహసం చేయడంలేదు. పథకాల అమలు తీరుని ప్రశ్నిస్తే, అసలు అవి అమలులో ఉన్నాయని బాబు ప్రజలకు మరోసారి గుర్తు చేసినట్టవుతుంది.
అందుకే నవరత్నాలంటేనే బాబు వణికిపోతున్నారు. మరోవైపు ఆ పథకాలే జగన్ కు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. వాటి వల్లే జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రేపు రాబోయే ఎన్నికల్లో అవే పథకాలు జగన్ గెలుపుని నల్లేరుపై నడకలా మార్చేస్తాయని అంటున్నారు.
సచివాలయాలు ఎత్తేయగలరా..?
గతంలో ఉన్న సచివాలయాలకే రూపు రేఖలు మార్చారని, కొత్తగా చేసిందేమీ లేదనేది చంద్రబాబు వాదన. మరి ప్రతి కార్యాలయంలో కొత్తగా వచ్చిన ఉద్యోగుల సంగతేంటి, వారు అందిస్తున్న సేవల సంగతేంటి..? వీటికి బాబు సమాధానం చెప్పగలరా.
పోనీ తన విధానమే బాగుంది అనుకుంటే ఇప్పుడున్న సచివాలయాలను, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం బాబుకి ఉందా..? అలా చెప్పి చంద్రబాబు ఓట్లు అడిగేందుకు జనంలోకి వెళ్లగలరా..?
అమ్మ ఒడి, నేతన్న నేస్తం, రైతు భరోసాని అడ్డుకోగలరా..?
అమ్మఒడి కింద తల్లులకు, పిల్లలకు అందుతున్న ఆర్థిక భరోసాని చంద్రబాబు అడ్డుకోగలరా? నేతన్న నేస్తం కింద అందుతున్న సాయాన్ని బాబు వద్దని చెప్పగలరా..? పోనీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఒడ్డున పడేయడానికి రైతు భరోసాని ఆపేస్తామని ప్రకటించగలరా..? వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు చేయలేరు.
అంటే నవరత్నాల కార్యక్రమాలను బాబు పరోక్షంగా సమర్థిస్తున్నట్టే లెక్క. పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా కూడా సమర్థించాలి, తప్పనిసరిగా ఆమోదించాలి. 2024 ఎన్నికల ప్రచారం నాటికి నవరత్నాలు బాబుకి జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించి ఇప్పట్నుంచే నీళ్లు నములుతున్నారు చంద్రబాబు.