దసరా నాటికి మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నారు. అలా అనుకున్న దసరా పోయి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో దసరా సంబరాలు కోర్టు కేసుల వల్ల మిస్ అయిపోయాయి. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది. ఇప్పుడు మరో దసరా వస్తోంది. మరి ఈసారి దసరాకు వైసీపీ సర్కారు ఏం చేయబోతోంది?
విశాఖ నుంచి పాలన మొదలు పెడుతుందా..?
ప్రస్తుతం శాసన రాజధానిగా అమరావతిలో అసెంబ్లీ ఉంది. దాన్ని మార్చాల్సిన పనిలేదు. న్యాయరాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేస్తామనుకుంటున్నా.. అక్కడ హైకోర్టు బిల్డింగ్ శాశ్వత నిర్మాణాలు పూర్తవ్వాలంటే కచ్చితంగా రెండేళ్లు పడుతుంది. ఇకపోతే పరిపాలనా రాజధాని విశాఖ ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
ఇప్పటికిప్పుడు అక్కడ సచివాలయం నిర్మించలేరు కానీ, ప్రభుత్వ భవనాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన కొనసాగించవచ్చు. కనీసం సీఎం తలచుకుంటే తన క్యాంప్ ఆఫీస్ ని అయినా మార్చేసుకోవచ్చు. మూడు రాజధానులకు, క్యాంప్ ఆఫీస్ కి అసలు సంబంధమే లేదు. కానీ కోర్టు కేసులు క్లియర్ అయితేనే అన్నీ చేయాలనుకుంటున్నారు జగన్.
విశాఖకు దసరా ఊపొచ్చేనా..?
కోర్టులతో సంబంధం లేకుండా మధ్యేమార్గంగా ముందు సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఈ ఏడాది దసరా నాటికి విశాఖలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
విశాఖలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా ప్రారంభిస్తారంటున్నారు. విశాఖలో ప్రభుత్వం తరపున దసరా సంబరాలు జరిపే ఆలోచన కూడా ఉందట. వీటిలో ఏ ఒక్కటి జరిగినా విశాఖకు ఊపొస్తుంది.
మంత్రివర్గాన్ని విస్తరిస్తారా..?
జగన్ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు కూడా మహూర్తం దగ్గరపడింది. దసరాకు దీనికి సంబంధించిన కసరత్తు మొదలవుతుందని తెలుస్తోంది.
దసరా రోజు కొత్త జాబితా బయటకొస్తుందని, లేదా.. విస్తరణకు సంబంధించిన ప్రకటన అయినా వెలువడుతుందని అంటున్నారు. ఈ ఊహాగానాలకు జగన్ చెక్ పెడతారో లేదో చూడాలి.
కర్నూలులో సందడి మొదలవుతుందా..?
హ్యూమన్ రైట్స్ ఆఫీస్, లోకాయుక్త ఆఫీసులు కర్నూలులో పెట్టడానికి రెడీ అవుతోంది ప్రభుత్వం. మరి వీటికి కూడా దసరా మహూర్తంగా పెట్టుకుంటున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. దసరాకు కర్నూలులో సంబరాలు మొదలవుతాయనే చెబుతున్నారు.
బ్యాలెన్స్ నవరత్నాలకు మహూర్తం దసరాయేనా..?
ఎన్నికల హామీగా ప్రకటించిన నవరత్నాల్లో 80శాతం పథకాలు ఆల్రడీ అమలులో ఉన్నాయి. మరికొన్నిటి అమలు వాయిదా పడుతూ వస్తోంది. మిగిలిన పథకాల అమలుకి జగన్ దసరా మహూర్తంగా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే రోజు కొత్త పథకాలు ప్రారంభిస్తారని కూడా అంటున్నారు.
మరి జగన్ మనసులో ఏముందో.. ఈసారి దసరాకు ఏం చేస్తారో కొన్నిరోజులాగితే తేలిపోతుంది.