కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మౌనంతో గవర్నర్‌కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ మాత్రం మాటలతో రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించ లేదంటూనే, ఆమె రాజకీయ విమర్శలు చేయడాన్ని తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా మరోసారి ఆమె కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం కేసీఆర్‌ను రప్పించిన చరిత్ర తనదని గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్య చేశారు. తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను తాను సందర్శించిన తర్వాతే కేసీఆర్ ఫాలో అయినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అందుకే ఆమె తన ఘనతగా చెప్పుకోవడం. ఖమ్మంలో వరద ప్రాంతాలకు ఆమె నేరుగా వెళ్లారు. అక్కడి ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ వెళ్లిన తర్వాతే కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
గవర్నర్ మరిన్ని సంచలన సంగతులు చెప్పారు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ సర్కార్ సొమ్మును తీసుకోలేదని ఆమె ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. అలాగే రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను ఆవిష్కరింపనివ్వలేదని, ప్రసంగించనివ్వలేదని ఆక్రోశం వెళ్లగక్కారు.
గవర్నర్ ఆవేదన చూస్తే… ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే సందర్భం లేకపోయినా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను అవమానిస్తున్నా, పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నట్టు ఆమె చెప్పకనే చెప్పారు. రాజ్‌భవన్‌లో ఖర్చులను తానే భరిస్తున్నానని చెప్పడం ద్వారా, కేసీఆర్ సర్కార్‌తో ఏ స్థాయిలో విభేదాలున్నాయో ప్రపంచానికి ఆమె తెలియజేశారు.