రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైనట్లు కనపడుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు చంద్రబాబుతో భేటీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని, జగన్ మోహన్ రెడ్డినీ మళ్లీ సీఎం చేయాడనికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎందుకు గెలిపించుకోవాలో ప్రజలకు వివరించాలని, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేక పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తునరంటూ మండిపడ్డారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారని, మేం ఎదురుతిరిగితే మీరు తట్టుకోగలరా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్ అని, మన నాయకుడు చేసిన మంచిని చెప్పుకుని సగర్వంగా ప్రజల్లోకి వెళ్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మూడు రాజధానుల వల్లే రాష్ట్ర మంతా అభివృద్ధి చెందుతుందని, అందుకే మూడు రాజధానులు ప్రకటించిన తర్వాతే అమరావతి ప్రాంతంలో కూడా వైసీపీ విజయం సాధించిందన్నారు. వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో ఎవరూ రెచ్చిపోవద్దు అంటూ వైసీపీ శ్రేణులకు సూచించారు.
మొత్తానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు వచ్చే 18 నెలలూ పూర్తి స్ధాయి రాజకీయం రాష్ట్రంలో నడుస్తున్నట్లు కనపడుతోంది. కాకపోతే వైసీపీ ఒక వైపు మరో వైపు టీడీపీ-జనసేన జట్టు కడతారా లేక టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు కట్టుకొని ఎన్నికలకు వెళ్తారా అనేది క్లారిటీ రావాల్సింది. చంద్రబాబు గెలుపు కోసం చిన్న చితక పార్టీలతో కూడా జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది.