టీడీపీలో గుబులు రేపుతున్న పొత్తు!

జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసిపోతే …ఆ కూట‌మికి అధికారం ద‌క్కుతుంద‌ని ఎల్లో మీడియా సంబ‌ర‌ప‌డుతోంది. ఆలు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఇంకా అధికారికంగా పొత్తు ఖ‌రారు…

జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసిపోతే …ఆ కూట‌మికి అధికారం ద‌క్కుతుంద‌ని ఎల్లో మీడియా సంబ‌ర‌ప‌డుతోంది. ఆలు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఇంకా అధికారికంగా పొత్తు ఖ‌రారు కాకుండానే, అధికారంపై అప్పుడే క‌ల‌లు కంటున్నారు. 

ఇదిలా వుండ‌గా ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఖ‌రారు అయితే టీడీపీ త్యాగం చేయాల్సి వుంటుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సినిమా గ్లామ‌ర్ త‌ప్పితే, రాజ‌కీయంగా ఆయ‌న పార్టీ నిర్మాణమే జ‌ర‌గ‌లేద‌న్న‌ది వాస్త‌వం.

పొత్తులో భాగంగా జ‌న‌సేనాని 40 అసెంబ్లీ సీట్లు అడిగే అవ‌కాశం వుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే 40 చోట్ల టీడీపీ అభ్య‌ర్థుల గ‌తేంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల లాభం ఏ మాత్ర‌మో తెలియ‌దు కానీ, కొన్ని చోట్ల న‌ష్ట‌పోక త‌ప్ప‌ద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. త‌మ‌ను సీటు వ‌దులుకోవాల‌ని ఎక్క‌డ కోరుతారో అని టీడీపీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంది.

ఇప్ప‌టికే కొన్నిచోట్ల ఫ‌లాన సీటు జ‌న‌సేన‌కే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి, అనంత‌పురం, నెల్లూరు, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నంల‌లో ఒక్కో సీటు, అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో అత్య‌ధికంగా జ‌న‌సేన డిమాండ్ చేసే అవ‌కాశాలున్నాయి. రాజ‌కీయాల్లో ఒన్ ప్ల‌స్ ఒన్ ఎప్పుడూ రెండు కాద‌నే వాస్త‌వాన్ని గ్ర‌హించాలి. ఏ నాయ‌కుడూ త‌న ఆధిప‌త్యాన్ని మ‌రొక‌రికి క‌ట్ట‌బెట్ట‌డానికి సిద్ధంగా ఉండ‌రు.

ఒక్క‌సారి మ‌రొక‌రి చేతిలోకి నాయ‌క‌త్వం వెళితే, జీవితంలో మ‌రెప్పుడూ తిరిగి రాద‌ని నేత‌ల‌కు బాగా తెలుసు. అందుకే సొంత పార్టీ కాదంటే… ప‌క్క పార్టీలోకి వెళ్లి సీటు ద‌క్కించుకోవ‌డ‌మా? లేక స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిలిచి వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డ‌మా? ఈ రెండింటో ఏదో ఒక‌టి జ‌రుగుతూ వుంటుంది. 

జ‌న‌సేన వ‌ల్ల త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగితే ఓకే గానీ, క్షేత్ర‌స్థాయిలో నామ‌మాత్రంగా ఉండే ఆ పార్టీ కోసం సీటు త్యాగం చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రార‌నే చ‌ర్చ టీడీపీలో న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో పొత్తు కుదుర్చుకున్నంత ఈజీ కాదు, సీట్ల పంపిణీ. అధికారికంగా పొత్తు ఖ‌రారైతే, సీట్ల పంపిణీ స‌మ‌యానికి టీడీపీ నుంచి నిర‌స‌న గ‌ళాలు త‌ప్ప‌క వినిపిస్తాయి.