ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు పార్టీ పెద్దలు మొట్టికాయలు వేసినా… ఆయనలో మార్పు రాలేదు. తాను చంద్రబాబు మనిషినే అని చాటుకోడానికి ఆయన తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకురావడానికి, రామకృష్ణ జగన్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం గమనార్హం. చింతమనేని ప్రభాకర్ ఎలాంటి నాయకుడో తెలిసి కూడా రామకృష్ణ వంత పాడడంపై సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు.
చంద్రబాబు హయాంలో మహిళా అధికారి, అలాగే అణగారిన వర్గాలపై చింతమనేని ఏ విధంగా రౌడీయిజం చేశారో జగమెరిగిన సత్యమే. ఏ ప్రజాస్వామిక వాదికో మద్దతుగా నిలిచి ఉంటో రామకృష్ణ ఆవేదనను అర్థం చేసుకోవచ్చని సీపీఐ శ్రేణులు అంటున్నాయి. కానీ సమాజంలో గౌరవం లేని వ్యక్తికి మద్దతుగా నిలిచి సీపీఐ పరువు పోగొట్టేలా రామకృష్ణ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీ నుంచి లేకపోలేదు.
చింతమనేని ధర్నా చేసిన సమయంలో వదిలేసి మరో ఊరిలో అరెస్టు చేయడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖలోని ఓ శుభకార్యానికి వెళితే చింతమనేనిని అరెస్టు చేయడంపై రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం బుర్రతో పని చేస్తుందా? లేక మోకాలుతో పని చేస్తుందో అర్థం కావడంలేదని రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆవేదన ఏదో సీపీఐ శ్రేణులపై రామకృష్ణ చూపితే బాగుండేదని సొంత పార్టీ నేతలు హితవు చెబుతున్నారు.
ఇటీవల పార్టీ సమావేశంలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరంలో ఉంటూ రాజకీయం చేయాలని హితవు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మనిషనే ముద్ర నుంచి ముందు బయటికి రావాలని పార్టీ పెద్దలు రామకృష్ణకు గట్టిగా చెప్పిన సంగతిని మరోసారి గుర్తు చేస్తున్నారు. అయినా టీడీపీ నేతలకు వంతపాడడం చూస్తే … రామకృష్ణ బుర్రతోనా లేక మోకాలుతో ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని సీపీఐ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఎం విధానాల్ని ప్రశంసిస్తుండడం గమనార్హం.