కాంగ్రెస్ పార్టీ విధానాలను గమనిస్తే.. ఈ పార్టీ మారదు అని దాని అభిమానులే తలపట్టుకోవాల్సి వస్తుంది! ఇలాంటి సంఘటనే ఇది కూడా! ఏ వ్యవహారంలో అయితే కాంగ్రెస్ తీరులో ప్రధాన మార్పు రావాలో.. ఆ విషయంలోనే మారే ప్రసక్తి ఉండదన్నట్టుగా కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఈ క్లారిటీ ఇవ్వడం కామెడీగా మారుతూ ఉంటుంది.
అందుకు ఉదాహరణ హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వ వ్యవహారం. అవతల పోటీ పార్టీలో అభ్యర్థులను ప్రకటించేసుకున్నాయి. వారు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ప్రచారాన్ని తలపింపజేస్తున్నారు. పాటలు, ఫైట్లు అన్నీ సాగుతున్నాయి వారి మధ్యన. ఇదే కాంగ్రెస్ ఇప్పటి వరకూ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. సరే.. తేల్చుకోలేకపోతోదేమో పాపం అనుకోవచ్చు.
ఈ అంశం గురించి పీసీసీ అధ్యక్షులుంగారు చాలా కసరత్తే చేసి ఉంటారు. ఆ పై ఇన్ చార్జి ఠాగూర్ కూడా నేతలతో సమావేశాల మీద సమావేశాలు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. ఈ మధనంతో ఒక ఫైనల్ లిస్ట్ తయారయ్యిందట. ఆ లిస్టులోని నేతల పేర్లను చెబుతూ ఆయన ఇప్పుడు నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారట. మరి ఇంతజరిగిన తర్వాత.. ఇంతకీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు అంటే.. సోనియాగాంధీ ఆమోద ముద్ర పడిన తర్వాత అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు!
ఇందుమూలంగా చెప్పేదేమిటంటే.. ఈ ఫైనల్ లిస్టులు, కసరత్తులు, ఆశావహులు, సమీకరణాలు, స్థానిక పరిస్థితులు..వీటన్నింటిపై ఇక్కడి నేతలు ఎలా జుట్లు పట్టుకున్నా, అభ్యర్థిగా ఎవరుండాలనే అంశంపై తమ తమ అభిప్రాయాలను చెప్పినా… అసలు ప్రకటన మాత్రం ఢిల్లీ నుంచి వస్తుంది. సోనియానే ఆ పని చేస్తారని కాంగ్రెస్ క్లారిటీ ఇస్తోంది.
ఒకవేళ ఇదే ఉప ఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో నేతల మధ్యన పోటీ ఉందనుకుందాం. ఒకరెవరైనా ఇక్కడ అందరినీ మేనేజ్ చేసో, అందరి మెచ్చుగోలుతోనో.. అభ్యర్థిత్వం విషయంలో ముందంజలో నిలిచాడనేకుందాం. మరొకరు ఎవరైనా సోనియా వద్దకు వెళ్లి సాగిలాపడేసి, ఆమెకు కావాల్సిన వాళ్లతో రికమెండ్ చేసేసుకుంటే? కథ కంచికే కదా!
ఇక్కడ జరిగిన కసరత్తు అంతా జస్ట్ ఢిల్లీలో ఒక పాదపూజతో చెత్తబుట్ట దాఖలవుతుంది. దాదాపు పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే తీరే ఉంది. ఈ తీరే ఆ పార్టీ ఉనికినే హరించేంత వరకూ వచ్చింది. అయితే కాంగ్రెస్ తీరులో మార్పు లేదు. ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో కూడా సోనియానే అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పుకుంటూ కాంగ్రెస్ నేతలు మార్పు ఉండదనే సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు.
అలా కాదు.. మేడమ్ ఫలానా వారిని అభ్యర్థిగా ప్రకటించమని వీళ్లు ఒక ఏకాభిప్రాయ ప్రకటన హైదరాబాద్ లో చేసేస్తే, ఢిల్లీ అందుకు సై అన్నట్టుగా ఇంకో ప్రకటన చేస్తే.. ఒక పొలిటికల్ డ్రామా అయినా నడుస్తుంది. కాంగ్రెస్ నేతలేమో సోనియా పాదపూజ చేస్తున్నట్టుగా కనిపించడం ఆనందం, ఆమెకేమో ఈ పాదపూజలే ఆనందం! ఇది కథ. ఇదే కథ!